వైరల్ ఇష్యూ: ముద్రగడ దగ్గరకు పవన్ రాయబారం?

ఈనెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మొదలుపెడుతున్నారు. ఈ సందర్భంగా భారీ సభను కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రత్తిపాడు అంటే… ముద్రగడ నియోజకవర్గం! ఈ సమయంలో ముద్రగడ వద్దకు పవన్ రాయబారం పంపారనే ఒక వార్త ఇప్పుడు గోదావరి జిల్లాలో వైరల్ గా మారింది.

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు అప్పట్లో రాష్ట్రంలో ఎంత కలకలం సృష్టించింది అందరికీ తెలుసు. ఆ సమయంలో కాపుల్లో ముద్రగడ ఇంకాస్త ఎత్తుకు ఎదిగిపోయారు. ఆ సామాజికవర్గంలో నమ్మకమైన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఈ సమయంలో ఆయన ప్రాంతం నుంచి జనసేన అధినేత పవన్ వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు.

ఈ సందర్భంగా… ఈ యాత్రకు ముద్రగడ పద్మనాభం మద్దతు కోసం జనసేనలోని ఒక కీలక నేత ఆయన ఇంటికి వెళ్లారని తెలుస్తుంది. ఇందులో భాగంగా పవన్ యాత్రకు మద్దతు తెలపాలని కోరారంట. అయితే పవన్ పంపితే వెళ్లారా.. లేక, సొంతపెత్తనంలో భాగంగా వెళ్లి అడిగారా అనేది ఇంకా తెలియలేదు కానీ… వెళ్లడం మాత్రం జరిగిందని కథనాలొస్తున్నాయి!

అయితే ఈ సందర్భంగా ఒకసారి గతాన్ని గుర్తుచేశారంట పద్మనాభం. దీంతో సదరు రాయబారికి దిమ్మతిరిగి బొమ్మ కనపడిందని అంటున్నారు! దీంతో జనసేన నేతతో ముద్రగడ అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ… కొన్ని ప్రశ్నలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తన మద్దతు అడగడానికి వచ్చారా?

పవన్ పంపితే వచ్చారా… లేక, మీ అంతట మీరుగానే వచ్చారా?

గతంలో తాను ఉద్యమాలు చేసినప్పుడు మీ అధినేత ఎప్పుడైనా నాకు మద్దతు ఇచ్చారా..?

చంద్రబాబు ప్రభుత్వం తనతో పాటు తన కుటుంబాన్ని అవమానించినప్పుడు కనీసం మీ అధినేత పరామర్శకు కూడా ఎందుకు రాలేదు?

అప్పుడు సమాజికవర్గం, ముద్రగడ పద్మనాభం గుర్తుకు రాలేదా?

రాబోయే ఎన్నికల్లో జనసేన 175 సీట్లలోనూ పోటీచేస్తుందా..?

వంటి కొన్ని సూటి ప్రశ్నలు అడిగారంట ముద్రగడ. దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న సదరు జనసేన నేత వచ్చినదారిలోనే రెట్టింపు వేగంతో వెళ్లిపోయారని అంటున్నారు!!