జనసేనలో ‘మెగా’ కుదుపు.! మహిళా నేత నిర్వాకం.!

జనసేన పార్టీ కార్యకర్తలు రెండుగా విడిపోయారు. ఔను, ఇది నిజ్జంగా నిజం. సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వీరిలో ఓ వర్గం చిరంజీవి అభిమానులు కావడం గమనార్హం. ఆ చిరంజీవి అభిమానులు, ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు.? ఇంకెవరి మీద.? జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ మీద.

చిత్రమేంటంటే, రాయపాటి అరుణ మాత్రం, ‘నేను ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పను కూడా. పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి.. ఈ ముగ్గుర్నీ సొంత అన్నల్లా భావిస్తాను..’ అంటూ రాయపాటి అరుణ చెబుతుండడం గమనార్హం.

అసలు వివాదంలోకి వెళితే, చిరంజీవి ఫెయిల్యూర్ పాత్ వేయడం వల్లనే జనసేన పార్టీకి కష్టమవుతోందని ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో రాయపాటి అరుణ వ్యాఖ్యానించారు. అది ప్రజారాజ్యం పార్టీ గురించే. చిరంజీవి గనుక రాజకీయాల్లో నిలబడి వుంటే, రాజకీయాలు ఇప్పుడిలా వుండేవి కావన్నది రాయపాటి అరుణ ఉద్దేశ్యం.

జనసేన అధికార ప్రతినిథి ఉద్దేశ్యం ఏదైనాగానీ, ఆమె వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. ‘ఫెయిల్యూర్ పాత్’ అంశంపై అఖిల భారత చిరంజీవి యువత స్పందించింది. చిరంజీవికి రాయపాటి అరుణ బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

అయితే, ‘వైసీపీ ట్రాప్‌లో మీరు పడిపోయారు. నేను మాట్లాడినదాంట్లో తప్పు లేదు. పూర్తి వీడియో చూడండి..’ అంటున్నారు రాయపాటి అరుణ. కానీ, మెగా అభిమానులు ఊరుకోవడంలేదు. ‘ఇకపై జనసేనకీ మాకూ ఎలాంటి సంబంధం లేదు’ అని తెగేసి చెబుతున్నారు. ఇది జనసేన పార్టీలో అతి పెద్ద ప్రకంపనగానే చెప్పుకోవచ్చు.