మా లెక్కలు మాకున్నాయ్: జనసేన.!

2024 ఎన్నికలకు సంబంధించి తమదైన వ్యూహాలతో సిద్ధంగా వున్నామని జనసేన అంటోంది. ‘వ్యూహాన్ని జనసేనానికి వదిలేశాం. మేం, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం..’ అని జనసేన నేతలు అంటున్నారు.

‘ప్రస్తుతానికి టీడీపీతో కలిసి పని చేస్తున్నాం. అదీ, అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకే. కొందరు ఈ నిర్ణయంతో విభేదించొచ్చు. అలాంటివారిలో కొందరు పార్టీని వీడొచ్చు కూడా..’ అన్నది జనసేన నేతల వాదన.

అయినాగానీ, ‘మా వ్యూహాలు మాకున్నాయ్..’ అంటున్నారు జనసేన నేతలు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నదానిపైనా జనసేన స్పష్టతనివ్వడంలేదు. చంద్రబాబు బయటకు వచ్చాక, పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్యా చర్చ జరుగుతుందట.

‘ఇప్పటికైతే, జనసేన పార్టీకే ఎడ్జ్ వుంది. కానీ, టీడీపీ బలమైన పార్టీ. అందుకే, ఆ పార్టీని తక్కువ అంచనా వేయబోం. వైసీపీని ఎదుర్కొనడానికి టీడీపీ మద్దతు అవసరం..’ అని జనసేన నేతలు చెబుతున్నారు.

టీడీపీ వాదన ఇంకోలా వుంది. ‘మేం, జనసేన సాయం తీసుకుంటున్నాం. అంతమాత్రాన, జనసేన పార్టీని మాతో సమానంగా చూడలేం. ఇరు పార్టీల మధ్య ఓటు షేరింగ్ ఖచ్చితంగా వుంటుంది. కానీ, జనసేన పార్టీ సీట్లను డిమాండ్ చేసే స్థితిలో లేదు’ అని తెలుగు తమ్ముళ్ళు వ్యాఖ్యానిస్తుండడం జనసేనకు కొంత ఇబ్బందికరంగానే వుంది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మలివిడత వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులు, సీట్లపై మరింత స్పష్టతనిచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.