గ్లాస్ వచ్చేసిందహో.! జనసేనకి కాస్త ఊరట.!

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’.! ప్చ్.. దాన్ని ఫ్రీ సింబల్స్‌లో పెట్టేశారంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతుండడంతో జనసేన శ్రేణులు ఒకింత అసహనానికి గురయ్యారు.

2019 ఎన్నికల్లో జనసేన సాధించిన ఓట్లు, సీట్లు.. జనసేన పార్టీకి ‘కామన్ సింబల్’ విషయమై అర్హతలకు ఒకింత ప్రతిబంధకంగా మారిన సంగతి తెలిసిందే. రిజిస్టర్డ్ పార్టీగానే ఇంకా జనసేన పార్టీ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో కామన్ సింబల్ అనేది జనసేనకు ప్రతిసారీ ఇబ్బందికరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా, రాజకీయ ప్రత్యర్థుల ర్యాగింగ్ ‘గాజు గ్లాసు’ విషయమై తట్టుకోవడం జనసేన పార్టీకి చాలా కష్టమవుతోంది.

మొన్నటికి మొన్న, గాజు గ్లాసు గుర్తు పోయిందన్న ప్రచారంతో జనసేన పార్టీ, ఈ విషయమై స్పష్టత కోసం నానా తంటాలూ పడాల్సి వచ్చిందట. ‘అబ్బే, అదేం లేదు.. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసే’ అంటూ జనసేన శ్రేణులు చెప్పుకొచ్చాయ్.

ఇప్పుడైతే, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జనసేన పార్టీకి రిజర్వ్ చేసిన గాజు గ్లాసు గుర్తు అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అధికార పార్టీ వెకిలి విమర్శలకు ఇది చెప్పు దెబ్బ లాంటి సమాధానం.. అంటూ జనసేన శ్రేణులు కొత్త పల్లవి అందుకున్నాయి.

అధికార పార్టీకి వాస్తవాలు తెలియవని ఎలా అనుకోగలం.? పేర్ని నాని లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా, హద్దు మీరి వ్యాఖ్యలు చేశారు జనసేన గుర్తు మీద. అయితే, అది జనసేనను ర్యాగింగ్ చేయడం కోసమే.!