గాజువాకలో లెక్కలు సరే… చిక్కుల మాటేమిటి?

గత ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం హాట్ నియోజకవర్గాల్లో ఒకటి. కారణం… జనసేన అధినేత మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడమే. అయితే… ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో పవన్ కల్యాణ్ ఓటమి రుచిచూశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే… “అది గతం.. ఈ సారి అలా ఉండదు..” అని లెక్కలు చెబుతున్న జనసేన నేతలు.. అక్కడున్న చిక్కులను మరిచిపోతున్నారని అంటున్నారు జనసైనికులు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో పవన్ కు గాజువాక జనాలు షాకిచ్చారు. గెలుపైతే రాలేదు కానీ.. రెండోస్థానానికి పరిమితం చేస్తూ టీడీపీ కంటే ఎక్కువ విలువిచ్చారు. దీంతో ఈసారి ఒంటరిగా పోటీచేయాలా.. కలిసి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్న జనసేన నేతలకు… కలిసి పోటీచేస్తే కలిగే లాభం – కలిసి పోటీ చేయాల్సిన నష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుందంట. అయితే… ఈ విషయంలో కలిసి పోటీచేస్తే కలిగే నష్టాన్ని సవివరంగా వినిపిస్తున్నారంట జనసైనికులు!

గడిచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి 74,645 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి పవన్ కు 56,125 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు కు 54,642 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్న జనసేన నేతలు… గతంలో టీడీపీ, జనసేనకు వచ్చిన ఓట్లను కలిపి లెక్కచూసుకుంటున్నారు. దీంతో… వైసీపీ కంటే సుమారు 30వేల ఓట్లు పైన కనిపిస్తున్నాయి. దీంతో… టీడీపీతో పొత్తు పెట్టేసుకుని, గాజువాక నుంచి పవన్ రంగంలోకి దిగిపోయి.. అసెంబ్లీ గేటు తాకాలన్న కోరిక నెరవేర్చుకోవచ్చని అంటున్నారు జనసేన నేతలు!

అవును… ఈసారి గాజువాకలో అయినా విడిగాపోటీ చేస్తే చాలా కష్టం అని అంటున్నారు జనసేన నేతలు. కారణం… అక్కడ గడిచిన ఎన్నికల్లో 26.42% ఓట్లతో టీడీపీ మూడొస్థానానికి పడిపోయినా… అంతకముందు 2014 లో జరిగిన ఎన్నికల్లో 51.85% ఓట్లతో గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారంట. ఇదొకెత్తైతే… అప్పుడు కూడా వైసీపీ అభ్యర్థికి 40.26% ఓట్లొచ్చాయి. సో… ఇక్కడ గెలవాలంటే అంత ఈజీ కాదని… టీడీపీతో జతకడితే సులువే కానీ.. ఒంటరిగా అయితే తీరిపోద్దని చెబుతున్నారంట!

జనసేన నేతల ఓట్ల లెక్కలు అలా ఉంటే… ఆత్మాభిమానం విషయంలో తమ లెక్కలు మరోలా ఉన్నయంటూ, చిక్కుల వివరాలు చెబుతున్నారు జనసైనికులు.

వంగవీటి హత్య కేసులో టీడీపీ నేతల హస్తం ఉందని, వారే చేయించారని, వారు ఇప్పటికీ టీడీపీలో ఉన్నారని బలంగా నమ్ముతున్న మెజారిటీ జనసైనికులు మాత్రం… టీడీపీ – జనసేనల మైత్రిని ఏమాత్రం కోరుకోవడం లేదంట. టీడీపీతో కలిసి పవన్ ముందుకెళ్తే… పైన చెప్పుకున్న లెక్కలన్నీ మారిపోతాయని హెచ్చరిస్తున్నారంట! పవన్ ఒంటరిగా పోటీచేసినా తాము గెలిపించుకోగలమని ధైర్యంగా చెబుతున్నారంట! దీంతో… ఇన్ని సంక్షిష్ట పరిస్థితుల మధ్య పవన్.. ఈసారి కూడా గాజువాక నుంచే పోటీ చేస్తారా? లేక, మరో సురక్షిత స్థానం దిశగా ఆలోచిస్తారా? అన్నది వేచి చూడాలి!