గత శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు సంచలమయ్యాయి. బీజేపీ జాతీయ నాయకత్వం జనసేనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా.. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంటీముట్టనట్టు వ్యవహరించడం వాస్తవమేనని.. ఇందుకు సమన్వయ లోపమే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సరిదిద్దు చర్యలు వెంటనే ప్రారంభించారు.
ఆదివారం హైదరాబాద్‌లో పవన్ ఆఫీసులో సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసారు. ఇరువురు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు, ఎంపీ అభ్యర్థి విషయమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధిపై చర్చించాం. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఉభయ పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతాం. బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశాం.
ఇక 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం. ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించాము. కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాము’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.