28 ప్లస్ 2 అంటే.. మొత్తంగా ముప్ఫయ్ అసెంబ్లీ సీట్లనుకునేరు.! 28 అసెంబ్లీ సీట్లకు అదనంగా రెండు లోక్ సభ సీట్లు అట.! ఇదీ జనసేన పార్టీ లెక్క.. అనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఆశిస్తున్న సీట్ల లెక్క ఇదేనన్నది టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ‘ఖచ్చితంగా గెలిచే సీట్లనే అడుగుదాం. అంతకు మించి అడిగేసి, ఇబ్బంది పడటం దండగ. కొన్ని సీట్లలో అయితే గట్టిగా పోటీ పడగలం..’ అని జనసేన అధినేత, పార్టీ ముఖ్య నేతలకు నచ్చ జెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 28 సీట్లలో మెజార్టీ ఉభయ గోదావరి జిల్లాల నుంచే వుండబోతున్నాయట కూడా.
రెండు లోక్ సభ సీట్లు కూడా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోనే వుండొచ్చని అంటున్నారు. అయితే, జనసేన వైపు నుంచి మాత్రం 50కి పైగా సీట్లలో పోటీ చేస్తాం.. పొత్తులో అయితే.. అంటూ ఓ వాదన అనధికారికంగా తెరపైకొస్తోంది. ఐదు లోక్ సభ సీట్లకు తక్కువైతే ఒప్పుకునేది లేదని మీడియాకి జనసేన నేతలే లీకులు ఇస్తున్నారట.
‘ఇప్పటికైతే పొత్తుల చర్చలేమీ జరగడంలేదు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి మాట్లాడతాం..’ అన్నది అధికారికంగా జనసేన పార్టీ నుంచి వస్తోన్న సమాధానం. తెలుగుదేశం పార్టీ మాత్రం, జనసేనతో పొత్తు ఖరారైపోయిందన్నట్లే వ్యవహరిస్తోంది. 18 అసెంబ్లీ సీట్లు, ఓ ఎంపీ సీటు జనసేనకు ఇవ్వడానికి సిద్ధంగా వున్నామన్నది టీడీపీ వాదన.
కాగా, జనసైనికులు అయితే ‘ఒంటరి పోరాటమే బెటర్.. ఒకవేళ పొత్తు పెట్టుకున్నా.. చెరి సగం సీట్లు..’ అంటున్నారు. దానికి టీడీపీ మద్దతుదారులైన నెటిజన్ల నుంచి కౌంటర్ ఎటాక్ గట్టిగానే వస్తోంది.