అక్కడలా ఇక్కడిలా… జనసేనతో ఆటలాడుతున్న బీజేపీ!

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్న పొత్తుల రాజకీయంపై రకరకాల విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతుంది. కనీసం విలువలు, పద్దతులు అనేవి లేకుండానే జరుగుతుందా అనే చర్చా మొదలవుతుంది. ఈ సమయంలో జనసేనతో అటు తెలంగాణ, ఇటు బీజేపీ నాయకులు ఆటలాడుతున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్థానాల్లో గెలుపొందింది. ఇదే సమయంలో 119 స్థానాల్లోనూ 8 స్థానాల్లో పోటీచేసే అవకాశం జనసేనకు ఇచ్చింది. అయితే ఈ ఎనిమిది స్థానాల్లోనూ జనసేన డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు… జనసేనతో పొత్తు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా జరిగిన బీజేపీ సమావేశంలో… జనసేనతో పొత్తు నిర్ణయాన్ని పలువురు బీజేపీ నేతలు తప్పుబట్టారని తెలుస్తుంది. దీంతో మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… తెలంగాణలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.

దీంతో… తెలంగాణలో బీజేపీతో పొత్తు మూడునాళ్ల ముచ్చటైందనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో ఏపీలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటన రావడం గమనార్హం. ఇందులో భాగంగా తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి… జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందని తెలిపారు. అలా లేదని ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ ఎక్కడా చెప్పలేదని అన్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడిన ఆమె… భారతీయ జనతాపార్టీకి దూరంగా ఉన్నట్లుగా జనసేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ ఎక్కడా ప్రక‌టించ‌క‌పోవ‌డం వ‌ల్ల పొత్తు ఉన్నట్టే అని అన్నారు. దీంతో… పవన్ తో బీజేపీ నేతలు రాష్ట్రాలవారిగా ఆటలాడుతున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది. అక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన్న జనసేనను పక్కనపెట్టడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు.

మరోపక్క టీడీపీ – జనసేనల పొత్తు రాజకీయం ముందుకు కదులుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమన్వయ కమిటీల సమావేశాలు, ఉమ్మడి మేనిఫెస్టో చర్చలతో పాటుగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సర్ధుబాటుపై కూడా ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తుంది. మరోపక్క ఏపీలో బీజేపీతో కటీఫ్ చెప్పినట్లు పవన్ ఎక్కడా చెప్పలేదని పురందేశ్వరి చెప్పుకొస్తున్నారు! దీంతో… ఈ పొత్తు రాజకీయాలు ఎలా కొలిక్కి వస్తాయనేది ఆసక్తిగా మారింది.

వాస్తవానికి 2014 తరహా కూటమి తనకు ఆమోదం అని మొదట్లో పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క ఏపీలో బీజేపీ చీఫ్ కూడా మనసులో అలాంటి అభిప్రాయాన్నే పెట్టుకున్నారని అంటుంటారు. బహుశా ఆ నమ్మకంతోనే పురందేశ్వరి అలా వ్యాఖ్యానించి ఉంటారని.. అందుకే పవన్ కూడా బీజేపీ విషయంలో వేచి చూసే దోరణిలో ఉండటం వల్ల ఎక్కడా కామెంట్ చేయడం లేదేమోనన్ని అంటున్నారు.

ఏది ఏమైనా… ఏపీలో పొత్తులు, కూటములపై వీలైనంత తొందర్లో ఒక క్లారిటీకి రావడం అన్ని పక్షాలకూ మంచిదని అంటున్నారు విశ్లేషకులు! అలాకానిపక్షంలో ఓటరును కన్ ఫ్యూజన్ లోకి నెట్టే ప్రమాధం ఉందని చెబుతున్నారు!