జనగామలో టిఆర్ఎస్ ముత్తిరెడ్డి బామ్మర్ది ఏం చేసిండో తెలుసా(వీడియో)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ నేతల ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. పేద వారి భూములను కొల్లగొడుతూ వారిని బెదిరిస్తూ పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారే కాకుండా వారి బంధువులు కూడా ఈ దందాలలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

జనగాం టిఆర్ఎస్ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పలు భూ సెటిల్ మెంట్లు చేసి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. తాజాగా ఇప్పుడు ఆయన బంధువులు సెటిల్ మెంట్లలో పాల్గొని ప్రజలను, అమాయకులను భయభ్రాంతులకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

జనగాం జిల్లా పరిధిలోని పెంబర్తి గ్రామంలో మూల బావి దగ్గర బండ రాములు, చిన్న బోయిన నర్సయ్యలకు వ్యవసాయ భూమి ఉంది. వీరి భూమి పక్కకే రిటైర్డ్ సబ్ రిజిష్టార్ రమేష్ కు సంబంధించిన భూమి ఉంది. ఎవరి భూమిలో వారు కడీలు, ఫెన్సింగ్ నాటుకున్నారు. రమేష్ గ్రామానికి వచ్చి రాములు, నర్సయ్య భూమిలోని కడీలను తొలగించి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు.

రిటైర్డ్ సబ్ రిజిష్టార్ రమేష్ (చేయి ముందుకు చూపిస్తున్న వ్యక్తి )

రమేష్ కు మద్దతుగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బావమరిది జనార్ధన్ రెడ్డిని తీసుకొచ్చాడు. తాను ఎమ్మెల్యే బావమరిదినని ఏంటి అంటూ రైతులను జనార్ధన్ రెడ్డి తో పాటు రమేష్ కూడా బెదిరించాడు. రైతులు కూడా అంతే ధైర్యంతో తిరగబడటంతో చేసేది లేక వారు మిన్న కుండిపోయారు. అసలు నీ భూమి ఎంత, నీ లెక్క ఏంది అన్ని ఉంటాయిగా ఆ రూల్స్ ప్రకారం వ్యవహరించాలని రైతులు వారిని కోరారు. అవేమి పట్టించుకోకుండానే వారు భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు.

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బావ మరిది జనార్ధన్ రెడ్డి

ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను సముదాయించి స్టేషన్ లో మాట్లాడుకోవాలని తీసుకెళ్లారు. ముత్తిరెడ్డి యాదగిరి మద్దతుతోనే రమేష్ ఈ ఆరాచకాని పాల్పడుతున్నాడని గ్రామస్తులు తెలిపారు.

బెదిరింపు రాజకీయాలకు భయపడేదే లేదని ఎంత వరకైనా సిద్దమని గ్రామస్తులు తెలిపారు. హైకోర్టులో పిటిషన్ వేసైనా సరే మా భూమి మేం దక్కించుకుంటామన్నారు. అధికారులు కూడా రమేష్ కే మద్దతు పలుకుతున్నారన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన పదవిలో ఉన్న ముత్తిరెడ్డి ఇలాంటి అరాచకాలకు మద్దతు ఇవ్వడం సబబు కాదన్నారు. భూమి పై తాడో పేడో తేల్చుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని యువకులు, గ్రామస్థులు తెలిపారు. రమేష్ మర్యాదతో వ్యవహరించాలని లేకపోతే తాము ఏం చేయాలో అది చేసి చూపిస్తామని వారన్నారు.   రమేష్ బెదిరింపులకు గురి చేసిన వీడియో కింద ఉంది చూడండి. 

janagam