కాంగ్రెస్ పొన్నాలతో టచ్‌లో హరీష్ రావు, జనగామలో కలకలం

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీ విధానాల పై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జనగామ టికెట్ పట్ల జరుగుతున్న ప్రచారం మంచిది కాదన్నారు. తెలంగాణలో ఇప్పటికే బిసిలు అభద్రతా భావంలో ఉన్నారని, ఇలాంటి సమయంలో ఒక సీనియర్ బిసి నాయకుడి సీటును రెడ్డి వర్గానికి కేటాయిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. 

పొత్తులో భాగంగా జనగామ సీటును టిజెఎస్ కు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలిచే సీటును టిజెఎస్ కు కేటాయిస్తే ప్రత్యర్ది  టిఆర్ ఎస్ కు లాభం చేకూర్చినట్టవుతుందన్నారు. జనగామ సీటు తనదేనని, ఈ విషయం పై హైకమాండ్ అడిగితే తాను సమాధానం చెబుతానని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.    

 

 

తాను తన రాజకీయం కోసమో తన సీటు గురించో  మాట్లాడటం లేదని కానీ ఇంత అనాలోచితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదన్నారు. ఇది పార్టీకి చాలా నష్టం కలిగిస్తుందన్నారు. జనగామ టికెట్ ను ఒక రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారని జరుగుతున్న ప్రచారం పై అధిష్టానం స్పందించాల్సిన అవసరముందన్నారు. బిసిల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు.

“అయితే పొన్నాల లక్ష్మయ్యతో టిఆర్ ఎస్ కీలక నేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. జనగామ నుంచి టిఆర్ ఎస్ అభ్యర్ధిగా పోటి చేయాలని రాబోయే ప్రభుత్వం తమదేనని హరీష్ రావు పొన్నాలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మంత్రి వర్గంలో ఆర్ధిక శాఖను కూడా కేటాయిస్తామని హరీష్ రావు పొన్నాలకు ఆఫర్ ఇచ్చారని, కేసీఆర్ తో తనకు మాట ఇప్పించాలని అప్పుడే తాను నమ్ముతానని పొన్నాల హరీష్ కు చెప్పినట్టు సమాచారం.  కాంగ్రెస్ టికెట్ రాదు అన్న  అనుమానంతో పొన్నాల తన ఏర్పాట్లలో తాను ఉన్నారు.  నిశ్శబ్దంగా ఉన్న టిఆర్ ఎస్ కాంగ్రెస్ అసంతృప్తులతో చర్చలు జరిపి వారిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటువంటి కీలక సమయంలో పొన్నాల కాంగ్రెస్ ను వీడితే పార్టీకి పెద్ద నష్టమేనన్న చర్చ జరుగుతోంది.” 

 

జనగామ స్థానాన్ని పొన్నాల లక్ష్మయ్యకు కేటాయించకపోతే భారీ  ఎత్తున ఆందోళన చేస్తామని పొన్నాల అనుచరులు హెచ్చరించారు. పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీసం ఎమ్మెల్యే సీటు ఇవ్వరా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనగామ రాజకీయాలు హీటెక్కాయి.