బాబ్లీ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జలీల్ ఖాన్

బాబ్లీ కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయి. మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తెలంగాణాలో ఉందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. టీడీపీ శ్రేణులంతా ఇది కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రగా అభివర్ణిస్తున్నారు. మోడీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చూడండి.

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మి నారాయణ పేరులోనే కన్నం ఉంది. అవినీతి చేసి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. మేము నీతి నిజాయితీ పరులమని మోడీ, అమిత్ షా చెబుతుంటారు. మా మీద ఎటువంటి మచ్చ లేదంటారు. మీకు దమ్ముంటే ఒకసారి కన్నా లక్ష్మి నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఎంత సంపాదించాడో సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి. మాల్యా అమిత్ షా గురించి చెప్పిన విషయంపై చర్య తీసుకోండి. బ్యాంకుల నుండి కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టిన విజయ్ మాల్యాకు సహకరించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇవ్వండి అని బీజేపీకి సూచించారు జలీల్ ఖాన్.

బాబ్లీ కేసు ఏమైనా నేరమా? చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా చేశారా? పోనీ యువతరాన్ని పార్టీ కార్యకర్తల్ని తరలించారా? మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో అక్కడికి వెళ్లడం జరిగింది. అది కూడా ఎక్కువ సంఖ్యలో లేరు. చితకబాది, సామాన్య మనుషులతో కూడా ప్రవర్తించని తీరులో ప్రవర్తించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆరోజు మీ మీద కేసులేవీ లేవన్నారు. 8 సంవత్సరాల తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇవ్వటం కుట్ర కాకపోతే మరేమిటి? అంటూ మండిపడ్డారు జలీల్ ఖాన్.

ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు త్వరలోనే టీడీపీలో చేరనున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు జలీల్ ఖాన్. గతంలో కూడా శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు చెప్పిన ఆయన ఈసారి మాత్రం పార్టీ మారబోయేది ఎవరో పేర్లు వెల్లడించలేదు. దీంతో జలీల్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.