జలీల్ ఖాన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. అంత పాపులర్ ఆయన. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన తప్పు సమాధానంతో ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోయారు జలీల్ ఖాన్. ఆయన తన క్వాలిఫికేషన్ గురించి చెబుతూ బీకామ్ ఫిజిక్స్ చదివా అనడంతో అది కాస్త వైరల్ అయిపోయింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇక జలీల్ ఖాన్ పై తెగ ట్రాల్స్ మొదలయ్యాయి. వీటితో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఎంతలా అంటే బీకామ్ అన్నా, ఫిజిక్స్ అన్నా ఆయనే గుర్తొచ్చేంతగా ఫేమస్ అయిపోయారు.
అయితే జలీల్ ఖాన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. మైనారిటీ సదస్సులో మాట్లాడుతూ మళ్ళీ తప్పులో కాలేసారు జలీల్. తన ప్రియతమ నాయకుడిని పొగుడుతూ, దివంగత నేత వైఎస్సార్ ను విమర్శిస్తున్న నేపథ్యంలో జలీల్ ఖాన్ నోటి నుండి మరో తప్పు దొర్లింది. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న జగన్ మోహన్ రెడ్డి” అన్నారు. దీంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు నెటిజెన్లు. హే…జలీల్ ఖాన్ మళ్ళీ యేసేసాడు అంటూ ఆ వీడియోని షేర్లు చేసేస్తున్నారు నెట్ లో. ఇదిలా ఉండగా…మైనారిటీ సదస్సులో జలీల్ ఖాన్ వైఎస్సార్, వైసీపీ, జనసేనపై పలు విమర్శలు చేశారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
గుంటూరులో జరిగిన నారా హమారా, టీడీపీ హమారా సదస్సులో పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు జలీల్ ఖాన్. 125 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల కోసం చేసిందేమి లేదని ఆయన వెల్లడించారు. రాయలసీమలో ముస్లింలను ఎదగనీయకుండా చేసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజశేఖర్ రెడ్డి కడపలో హజ్ హౌస్ కట్టలేదని విమర్శించారు. మొట్టమొదటిసారి హైదరాబాదులో చంద్రబాబు హజ్ హౌస్ కట్టించారని గుర్తు చేశారు. త్వరలో విజయవాడ నగరంలో 80 కోట్ల రూపాయలతో హజ్ హౌస్, మసీదు, వక్ బోర్డు ఆఫీసు మూడు కలిపి 102 కోట్లతో నిర్మించడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు జలీల్.
రాజశేఖర్ రెడ్డిని, జగన్ మోహన్ రెడ్డిని దగ్గరుండి చూశాను. జగన్ క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసు, ఎవరిని గౌరవించడు. నెక్స్ట్ ఎలెక్షన్స్ లో ఆయన ఎలానో రాడు. దురదృష్టవశాత్తు ఎప్పుడైనా వస్తే మీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు, మీ స్థలాలు మీకు ఉండవు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎగతాళి కాదు నమ్మకంగా చెబుతున్నా రాసి పెట్టుకోండి అంటూ ఛాలెంజ్ చేశారు. కానీ చంద్రబాబు పాలనలో రోజురోజుకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు. శాంతియుతమైన పరిపాలన జరుగుతుంది అంటూ బాబుని పొగిడారు. రానున్న రోజుల్లో మీరంతా చంద్రాబుబుకే ఓటు వెయ్యాలని, అందరితో టీడీపీకే ఓటు వేయమని చెప్పాలని కోరారు.
సదస్సు తర్వాత మీడియాతో మాట్లాడిన జలీల్ ఖాన్ మరోసారి వైసీపీ, జనసేనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తుని ఘటన తరహాలో గొడవ చేసేందుకు వైసీపీ పధకం వేసిందని వ్యాఖ్యానించారు జలీల్ ఖాన్. ప్రత్యర్థి పార్టీసభల్లో అల్లర్లు చేయడం జగన్ కే కాదు…ఆయన తాత, తండ్రికీ అలవాటే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని అభిప్రాయాన్ని వెల్లడించారు. వచ్చే ప్రభుత్వంలో ముస్లిం అభ్యర్ధికి డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని సీఎంని కోరామన్నారు. జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అన్నారు. క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలం లేని జనసేన ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు జలీల్ ఖాన్.