జైలు డీలు.! జనసేన – టీడీపీ ములాఖత్.!

ఇన్నాళ్ళూ నడిచింది ముసుగులో గుద్దులాట.. అన్నట్టు వ్యవహరించాయి టీడీపీ – జనసేన. ఇప్పుడంతా బహిర్గతం. నిజానికి, టీడీపీ – జనసేన మధ్య నడుస్తున్న స్నేహం ఎప్పుడో బహిర్గతమైపోయింది. కాకపోతే, అది అధికారికం కాబోతోంది కాస్సేపట్లో.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా వున్న సంగతి తెలిసిందే. ఆయన్ని పరామర్శించేందుకోసం ములాఖత్ అనుమతి తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హైద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళారు.

ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో ఏం మాట్లాడతారు.? అన్నది ఉత్కంఠగా మారింది. ఏం మాట్లాడినా, మాట్లాడకున్నా, టీడీపీ – జనసేన పొత్తు విషయమై ఈ రోజు మరింత క్లారిటీ వచ్చేయబోతోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయమై చంద్రబాబుకి ఇంకో ఆప్షన్ లేదు.

టిక్కెట్ల పంపకాల విషయంలో కూడా ఇకపై డిసైడింగ్ ఫ్యాక్టర్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అవుతారు. చంద్రబాబుకి ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఉద్దేశ్యం వున్నట్లు కనిపించడంలేదు. ఆయనలా జైల్లోనే వుంటారు. జనసేన పార్టీని ముందు పెట్టి, తెరవెనుకాల టీడీపీ కథ నడిపిస్తుంది.. అన్నది తాజా ఖబర్.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకపోవచ్చునట కూడా. చంద్రబాబు స్థానంలో ఆయన సతీమణి భువనేశ్వరి పోటీ చేయబోతున్నారట. అవసరమైతే జనసేన పార్టీకి, టీడీపీ కంటే ఎక్కువ సీట్లు కేటాయించేందుకూ టీడీపీ సుముఖంగానే వుంది. అదే మంచిదన్న భావనలో టీడీపీ క్యాడర్ కూడా వుంది.

నిన్న మొన్నటిదాకా రెండు పార్టీల మధ్య ఓటు షేరింగ్ ఎలా జరుగుతుందనే అనుమానాలున్నా, చంద్రబాబు అరెస్టుతో అవీ పటాపంచలైపోయాయ్. జైల్లో వున్నా చంద్రబాబు, వ్యూహాత్మకంగా బీజేపీతోనూ సంప్రదింపులు జరిపిస్తున్నారట. పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి.. నేను జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటూ చంద్రబాబు చెబుతున్నారన్నది తాజా ఖబర్.

మొత్తమ్మీద, టీడీపీ – జనసేన జాయింట్ వెంచర్ దాదాపు ఖరారైనట్లే. అందులోకి బీజేపీ చేరడమొక్కటే మిగిలి వుంది.