జగన్ దృష్టంతా ఈ 21 నియోజకవర్గాలపైనే!

కంచుకోటల్లోనూ, రెగ్యులర్ గా గెలిచే చోటా గెలిస్తే గొప్పేముందు. ఎప్పుడూ గెలవని చోట గెలిస్తేనే కదా కిక్కు, ధమ్ము.. అంటూ గతలో లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్నారో.. లేక, ఈసారైనా ఆయా స్థానాల్లో ఫ్యాన్ తిరగడం చూడాలని భావించారో తెలియదు కానీ… తాజాగా “టార్గెట్ – 21” స్టార్ట్ చేశారంట వైఎస్ జగన్. ఇప్పటికే “వైనాట్ 175” అనే లక్ష్యం ఉన్నా.. ప్రాక్టికల్ గా అది ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్న వైకాపా నేతల్లో ఉన్నా.. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే… ఫస్ట్ ఈ 21 టార్గెట్ ని దృష్టిలో పెట్టుకోవాలని భావిస్తున్నారంట జగన్!

అవును… రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తే చాలు… వైనాట్ 175 ని సాధించినట్లే అని వైకాపాలో ఒక వర్గం భావిస్తున్న తరుణంలో… కుప్పంతో పాటు వైకాపాకు గెలుపును అందని ద్రాక్షగా చేస్తున్న నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించారంట. అందులో భాగంగా… రాయలసీమలో గెలుపు అందని ద్రాక్షగా చేస్తున్న నియోజకవర్గాలు కుప్పం, హిందుపురం ఉన్నాయి. వీటిపై జగన్ మనసుపడ్డారని తెలుస్తుంది.

ఇదే క్రమంలో… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, కొండెపిలో వైసీపీ ఇప్పటివరకూ గెలవలేదు. అదేవిధంగా… గుంటూరు-2లో ఎంత ప్రయత్నించినా వైసీపీకి గెలుపు దక్కలేదు. ఇక కృష్ణాజిల్లాలోని గన్నవరం, విజయవాడ తూర్పులో కూడా ఫ్యాన్ తిరగడంలేదు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపాకు అందని ద్రాక్షగా ఉన్న.. పాలకొల్లు, ఉండి తోపాటు.. తూర్పు గోదావరిలో రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, మండపేట, పెద్దాపురం, రాజోలులో ఫ్యాన్ కు ప్రతీసారీ ఎదురుగాలే వీస్తుంది.

ఇక ఉత్తరాంధ్ర లో కూడా ఫ్యాన్ కు గెలుపు దక్కనివ్వని నియోజకవర్గాల లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. ముఖ్యంగా పరిపాలనా రాజధానిగా మారుతున్న విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, టెక్కలిలో కూడా వైసీపీకి విజయం దక్కటంలేదు. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో జగన్ బలమైన అభ్యర్థుల‌ను పోటీకి దింపి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని… అదేజరిగితే వైనాట్ 175 సాధించినట్లేనని భావిస్తున్నారంట.

అందులో భాంగానే… గెలిచిన 150 మంది ఎమ్మెల్యేల పనితీరుపైన మాత్రమే కాకుండా… ఓడిపోయిన ఈ సీట్లలో కష్టపడుతున్న ఇన్చార్జ్ ల కష్టంపై కూడా కాన్సంట్రేషన్ చేస్తున్నారని.. కచ్చితంగా గెలిచి తీరాలని సూచిస్తున్నారని తెలుస్తుంది! మరి జగన్ కోరిక ఈ ఎన్నికల్లో అయినా తీరుతుందో లేదో వేచి చూడాలి. కాగా… పార్టీ ఏర్పడిన దగ్గర నుండి కొన్ని బై ఎలక్షన్లతో కలిపి 2 జనరల్ ఎలక్షన్స్ ను వైసీపీ ఎదుర్కొంది!