జగనన్నకి చెబుదాం.! కానీ, ఎందుకు.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనవంతుగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. తన పరిధిలో ఏమేం చేయడానికి అవకాశాలున్నాయో, వాటన్నటినీ చేసేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో అత్యంత ప్రత్యేకమైన పరిస్థితుల్లో పాత పేరుతో కొత్తగా ఏర్పడింది 2014లో.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక.. పాత పేరుతో కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. అప్పులతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇంకా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతూనే వుంది. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లతో రాష్ట్రం మరింత ఇబ్బందుల పాలైంది.

వైఎస్ జగన్ హయాంలో ఆ ఇబ్బందులు డబుల్ అయ్యాయన్నది నిర్వివాదాంశం. అయినా, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మరి, అభివృద్ధి సంగతేంటి.? రాజధాని మాటేమిటి.? పోలవరం ప్రాజెక్టు పరిస్థితేంటి.? ప్రత్యేక హోదా వ్యవహారమేంటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.

రాష్ట్రంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి.. మాట్లాడుకోడానికి చాలా వున్నాయ్. ఇవన్నీ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో చర్చకు వస్తే పరిస్థితి ఏంటి.? వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు సుస్పష్టం. ‘వై నాట్ 175’ అని వైఎస్ జగన్ అంటోంటే, అధినేత మాటల్ని లెక్క చేయకుండా కుమ్మలాటలకు దిగుతున్నారు వైసీపీ నేతలు.

అధినేత మెప్పు కోసం తప్ప, పార్టీ బాగు కోసం వైసీపీ ముఖ్య నేతలు ప్రయత్నించడంలేదాయె. ఈ తరుణంలో గడప గడపకూ మన ప్రభుత్వం అయినా.. స్టిక్కర్ల కార్యక్రమం అయినా.. జగనన్నకు చెబుదాం అయినా.. వీటి వల్ల ఉపయోగమేమీ వుండదు.!