అవును జగన్మోహన్ రెడ్డికి శాసనమండలిలో కష్టాలు తప్పవు. అసెంబ్లీ ఎన్నికలంటే అఖండ మెజారిటీతో గెలిచినా కౌన్సిల్ లో మాత్రం ప్రతీ విషయానికి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే. ప్రభుత్వం చేసే బిల్లులు అసెంబ్లీలో పాస్ అవటం చాలా సులభమే. శాసనమండలి విషయంలోనే సమస్యలు తప్పవు. ఎందుకంటే, అసెంబ్లీలో వైసిపికి ఎంత మెజారిటీ ఉందో కౌన్సిల్లో అంత మైనారిటీలో ఉంది.
శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. ఇందులో ప్రస్తుతం వైసిపికి ఉన్న బలం కేవలం 8 మాత్రమే. అదే తెలుగుదేశంపార్టీ విషయం చూస్తే 38 మంది సభ్యులతో చాలా బలంగా ఉంది. కాబట్టి మండలిలో ఏ బిల్లు పాసవ్వాలన్నా టిడిపి సహకారం తప్పదు. టిడిపి అడ్డుకుంటే ఏమవుతుంది ? అంటే అప్పటి పరిస్దితులను బట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
ప్రస్తుతం వైసిపి తరపున గెలిచిన ఎంపి, ఎంఎల్ఏల్లో ఇద్దరు ఎంఎల్సీలున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే రాజీనామా చేసేశారు. ఏలూరులో ఆళ్ళ నాని, విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, టిడిపి నుండి కరణం బలరామకృష్ణమూర్తి ఎంఎల్ఏలుగా ఎన్నికయ్యారు. వీరు ముగ్గురు తొందరలో రాజీనామా చేస్తారు. వీరిముగ్గురు ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీలు అయ్యారు కాబట్టి ఈ మూడు వైసిపికే దక్కుతాయి.
అదే స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీలు అయిన వారి విషయంలోనే స్పష్టత లేదు. ఈ కోటాలోని ఇద్దరు ఎంఎల్సీలు కూడా ఎంఎల్ఏలుగా గెలిచారు. ముగంట, పయ్యావుల కేశవ్ స్ధానిక సంస్ధల కోటాలో గెలిచారు. పయ్యావుల రాజీనామ చేస్తారు. కాబట్టి ఈ రెండు స్ధానాలను భర్తీ చేయాలి.
మరి స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిగిన తర్వాతే పై రెండు స్ధానాలను భర్తీ చేస్తారా ? అన్న విషయాన్ని ఎన్నికల కమీషనే తేల్చాలి. సరే ఏదేమైనా తొందరలో భర్తీ కాబోయే మూడు స్ధానాలు వైసిపి ఖాతాలోనే పడతాయి. కాబట్టి వైసిపి బలం 8 నుండి 11కి పెరుగుతుంది. అయినా జగన్ కు ఇబ్బందులు తప్పవు. మరి ఆ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.