ప్రచారం కోసం జగన్ కు హెలికాప్టర్

ఎన్నికల ప్రచారానికి ఎక్కువ రోజుల వ్యవధి లేకపోవటంతో జగన్మోహన్ రెడ్డి కూడా హెలికాప్టర్ ను ఉపయోగించనున్నారు. ఈనెల 16వ తేదీన పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయలో మొదటి జాబితా అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. వెంటనే ప్రచారానికి బయలుదేరేస్తారు.  రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపును జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకనే ప్రచారాన్ని సవాలుగా తీసుకున్నారు.

మొదటిజాబితాను విడుదల  చేసిన వెంటనే ఇడుపులపాయ నుండి గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెడతారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం, నెల్లిమర్ల  ప్రచారంలో పాల్గొంటారు.  తర్వాత అక్కడి నుండి గన్నవరంకు చేరుకుంటారు. వారం రోజుల్లో మొత్తం 45 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకనే హెలికాప్టర్ ను ఉపయోగించాలని అనుకున్నారు.

ఒకవైపు జగన్ ప్రచారం చేస్తుంటే మరోవైపు తల్లి, సోదరిలు విజయమ్మ, షర్మిల కూడా ప్రచారంలోకి దూకనున్నారు. తల్లీ, కూతుళ్ళిద్దరూ రోజుకు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని షెడ్యూల్ రెడీ అవుతోంది. వీరిద్దరు ఎక్కువగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. అంటే ఒకేసారి జగన్, విజయమ్మ, షర్మిల ముగ్గురు ప్రచారంతో హెరెత్తించేయాలని ప్లాన్  చేస్తున్నారు. మరి జగన్ శ్రమ ఏ మేరకు ఫలితాలిస్తుందో చూడాల్సిందే.