భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయం సాధించటంతో సరిపెట్టుకోకుండా దీర్ఘకాల రాజకీయ ప్రయోజనాల కోసమే తపిస్తున్నట్లు అర్ధమైపోతోంది. మొన్నటి మంత్రివర్గం కూర్పులో గానీ తాజాగా అట్టడుగు వర్గాల కోసం తీసుకున్న నిర్ణయాలను చూస్తుంటే ఈ విషయం స్పష్టమైపోతోంది.
151 సీట్ల బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రెడ్లదే హవా అని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తు మంత్రివర్గంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, మహిళలకే పెద్ద పీట వేశారు. 5 ఉపముఖ్యమంత్రి పదవులు కూడా పై వర్గాలకే ఇచ్చారు. దాంతో రెడ్లలో అసంతృప్తి మొదలైంది. ఎందుకంటే రెడ్లు ఒకటనుకుంటే దానికి రివర్సులో జరగటమే కారణం.
అలాగే నామినేటెడ్ వర్క్సు తో పాటు నామినేటెడ్ పోస్టుల్లో కూడా పై వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. పైగా ఆ మేరకు బిల్లులను తయారుచేసి అసెంబ్లీలో పాస్ చేసి చట్టం రూపం కూడా ఇచ్చేశారు. దాంతో పై వర్గాలు ఫుల్లుగా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెడ్లు, కమ్మోరు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల జనాభా తక్కువనే చెప్పాలి.
అగ్రవర్ణాలంతా కలిపినా ఓట్లలో 20 శాతం ఉంటే ఎక్కువే. మెజారిటి సెక్షన్ బిసిలు తర్వాత ఎస్సీలు, కాపులు, ఎస్టీలు, ముస్లింలు హోలు మొత్తం మీద మహిళల ఓటింగే ఎక్కువ. అందుకే ఈ వర్గాల ఓటు బ్యాంకును వైసిపికి స్ధిరంగా ఉంచుకునేందుకు దీర్ఘకాల ప్రయోజనాల కోసమే వాళ్ళకి అగ్రస్ధానం కల్పిస్తున్నారు. చట్టాలు చేస్తున్నంత ఉత్సాహంగానే అవి ఆచరణలో కూడా కనిపిస్తే జగన్ ను ఢీ కొనేవారే ఉండరనటంలో సందేహం లేదు.