రాజధాని గుట్టు బయటకు లాగుతున్న జగన్..తమ్మళ్ళల్లో టెన్షన్

ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకుండానే రాజధాని ప్రాంతంలో జరిగిన భారీ భూ కుంభకోణం గుట్టును జగన్మోహన్ రెడ్డి బయటకు తీస్తున్నారు. సిఆర్డీఏ అధికారులకు జగన్ ఇచ్చిన ఆదేశాలు తెలుసుకుని చాలామందిలో టెన్షన్ పెరిగిపోతోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించేముందు చంద్రబాబునాయుడు భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని జగన్ అండ్ కో పదే పదే చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే.

రాజధానిగా అమరావతిని ప్రకటించేముందే తన బినామీలతో వేల ఎకరాలను చంద్రబాబు కొనుగోలు చేయించారన్నది జగన్ ప్రదాన ఆరోపణ. పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, పయ్యావుల కేశవ్, దూళ్ళిపాళ నరేంద్ర, నారాయణ, దేవినేని ఉమ…ఇలా ఒకరేమిటి ఇద్దరేమిటి అవకాశం ఉన్న ప్రతీ పెద్ద తలకాయ వందలాది ఎకరాలు కొనుగోలు చేశారని జగన్ అంటున్నారు.

టిడిపిలోని పెద్ద తలకాయలంతా  చవకగా భూములు కొనేసిన తర్వాతే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని జగన్ చాలా సార్లే ఆరోపించారు. ఇపుడా అంశంపైనే లోతుగా విచారణ జరిపించాలని జగన్ నిర్ణయించారట. సిఆర్డీఏ ఉన్నతాధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను పిలిపించుకుని ఈ మేరకు ఆదేశాలిచ్చారట.

రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందు, తర్వాత ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు, వాళ్ళ వివరాలు మొత్తం తన టేబుల్ పైన పెట్టమని జగన్ ఆదేశించారట. నిజంగానే ఫైళ్ళు జగన్ టేబుల్ పైకి చేరితే జరిగిన వేలాది కోట్ల భూ స్కాం మొత్తం బట్టబయలవటం ఖాయం. అపుడు నిజంగా నష్టపోయిందెవరు ? లాభపడిందెవరు ? అన్న విషయాలు జనాలకు తెలుస్తాయి.