ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు తాము ప్రభుత్వ ఉద్యోగులం అయ్యామని ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలు తమకు తప్పకుండా లభిస్తాయని భావించారు. అయితే ప్రభుత్వంలో విలీనం చేసినా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న స్థాయిలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనాలు కలగడం లేదు.
ఈ ఏడాది జనవరి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సంఘం ప్రకారం వేతనాలు పెరిగాయి. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు సైతం వచ్చే నెల నుంచి పెరిగిన జీతాలను అందుకోనున్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం వేతనాలు పెరగలేదు. వేతనాలు ఎప్పటినుంచి పెరుగుతాయో కూడా స్పష్టత లేదు. ఆర్టీసీ నష్టాలలో ఉంది కాబట్టి వేతనాలను పెంచలేమని అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది.
గత కొన్ని నెలల్లో ఆర్టీసీ ఛార్జీలు రెండుసార్లు పెరిగాయి. పెరిగిన టికెట్ రేట్ల వల్ల ఏపీ సర్కార్ కు సైతం ఊహించని స్థాయిలో ఆదాయం పెరిగింది. అయితే ఆదాయం పెరుగుతున్నా నష్టాలు వస్తున్నాయని చెబుతూ వేతనాలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు. ఖర్చులు పెరుగుతున్న స్థాయిలో ఆదాయం పెరగకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
వేతన సవరణ చేయడంతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం వైద్య సౌకర్యాలను కల్పించాలని ఉద్యోగుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మె చేయాల్సి వస్తుందని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయం ఉందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
