అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలుగుదేశంపార్టీ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సభలో చర్చ జరుగుతున్నపుడు పదే పదే అడ్డుతగులుతున్న టిడిపి ఎంఎల్ఏలను ఉద్దేశించి జగన్ రెచ్చిపోయారు. సీట్లలో కూర్చోమంటూ పదే పదే రెచ్చిపోయి వార్నింగులిచ్చారు. వైసిపి వైపున్న 151 మంది సభ్యులు కూడా టిడిపి సభ్యుల్లాగే రెచ్చిపోతే టిడిపి గొంతు ఎవరికీ వినిపించదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
సున్నావడ్డీపై రైతులకు రుణాల మంజూరు అంశంపై సభలో చర్చ జరిగే సమయంలో పై రచ్చ మొదలైంది. నిజానికి సున్నావడ్డీకే రైతులకు రుణాలు ఇవ్వాల్సినంతగా చంద్రబాబు హయాంలో అందలేదు. అదే విషయాన్ని జగన్ ఎత్తిచూపుతు చంద్రబాబును తప్పుపట్టారు. దాంతో టిడిపి ఎంఎల్ఏలు తట్టుకోలేకపోయారు. దాంతో గందరగోళానికి తెరలేపారు.
అంతకుముందు సున్నావడ్డీ అంశంపై నిబంధనలను పక్కనపెట్టి మరీ జగన్ చర్చ జరాపాల్సిందిగా స్పీకర్ ను రిక్వెస్ట్ చేయటంతో చర్చ మొదలైంది. చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు జగన్, వైసిపి సభ్యులు కానీ ఓపిగ్గానే విన్నారు. అదే జగన్ మాట్లాడటం మొదలుపెట్టగానే టిడిపి సభ్యులు అరుపులు, కేకలు మొదలుపెట్టారు.
జగన్ ఒకవైపు మాట్లాడుతుంటే టిడిపి సభ్యులు మరోవైపు రన్నింగ్ కామెంటరీ చేస్తునే ఉన్నారు. దాంతో జగన్ కు ఒళ్ళు మండిపోయింది. ఎంత వారించినా టిడిపి సభ్యులు వినకపోవటంతో జగన్ రెచ్చిపోయి వాళ్ళని అరవటం మొదలుపెట్టారు. టిడిపి సభ్యులపై పెద్దగా అరుస్తూ కసురుకున్నారు. అయినా వినకపోవటంతో జగన్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అపుడు స్పీకర్ జోక్యం చేసుకుని కాస్త గట్టిగా చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే సభలో గందరగోళం సద్దుమణిగింది.