జగన్ సంచలనం : ఐదుగురు డిప్యుటి సిఎంలు

రాష్ట్రచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా జగన్మోహన్ రెడ్డి ఐదుగురిని డిప్యుటి సిఎంలుగా నియమించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని వైఎస్సార్ ఎల్పీ సమావేశంలో స్వయంగా ప్రకటించారు. జగన్ ప్రకటన వినగానే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపిల్లో పెద్ద కలకలం మొదలైంది. ఏకంగా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా తీసుకోవటమంటే మామూలు విషయం కాదు.

డిప్యుటి సిఎంల ఎంపికలో కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, కాపు, బిసిలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. తన ప్రభుత్వంలో పై వర్గాలకే సగం పోస్టులు ఇస్తానని జగన్ పాదయాత్రలో చాలా సార్లు హామీ ఇచ్చారు. అప్పటి హామీకి కట్టుబడే జగన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతోంది.

ఉప ముఖ్యమంత్రులుగా  ఏ వర్గాలకు  చోటు కల్పించబోతున్నది చెప్పారే కానీ పై సామాజికవర్గాల్లో ఎవరిని తీసుకోబోతున్నది మాత్రం చెప్పలేదు. దాంతో డిప్యుటి సిఎంలుగా ఉండబోయేదెవరనే విషయంలో ఎవరికి వారుగా చర్చలు జరుపుకుంటున్నారు. డిప్యుటి సిఎంల విషయాన్ని పక్కనపెట్టినా మంత్రిపదవుల విషయంలో కూడా పై వర్గాలకే 50 శాతం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం మీద పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగానే పై వర్గాలకు 50 శాతం పదవులు కేటాయించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు.

అలాగే ఇపుడు తీసుకోబోతున్న మంత్రివర్గంలోని సభ్యులను రెండున్నరేళ్ళ తర్వాత ఖాళీ చేయించనున్నట్లు కూడా చెప్పారు. అంటే రెండున్నరేళ్ళ తర్వాత మళ్ళీ కొత్త వారికి ఛాన్సు ఇచ్చే ఉద్దేశ్యంతోనే జగన్ తాజా ప్రకటనుంది. వ్యక్తిగత లబ్దికన్నా సమస్యల పరిష్కారినికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను అవినీతికి అవకాశం ఇవ్వొద్దని చెప్పటం గమనార్హం.