అసెంబ్లీ స్పీకర్ స్ధానానికి జగన్మోహన్ రెడ్డి రెండు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్లుగా ఉంటూ మూడు, రెండు సార్లు గెలిచిన మేకతోటి సుచరిత, కోనా రఘుపతి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారట. ఇద్దరు కూడా గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, బాపట్ల నియోజకవర్గాల నుండి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.
మేకతోటి సుచరిత ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. కాంగ్రెస్ తరపున గెలిచిన మేకతోటి రాజీనామా చేసి జగన్ తో పాటు బయటకు వచ్చేశారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే మూడుసార్లు గెలిచినట్లే.
అలాగే కోన రఘుపతి కూడా 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. సౌమ్యునిగా కోనకు పేరుంది. పైగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. అందులో రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు కూడా గతంలో అంటే 1980-81 మధ్య కాలంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు.
ఒకవేళ స్పీకర్ పదవికి రఘుపతిని ఎంపిక చేస్తే బహుశా రికార్డవుతుందేమో. ఎందుకంటే తండ్రి, కొడుకులు అసెంబ్లీకి స్పీకర్లుగా పని చేసిన ఘటన రాష్ట్రంలో ఎవరి విషయంలోను జరగలేదు. మరి జగన్ మనసులో ఏముందో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.