పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిందేనా ? జగన్ చెప్పింది కరక్టేనా ?

ఇపుడిదే చర్చ రాష్ట్రంలో మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇంతకీ చంద్రబాబును ఉద్దేశించి జగన్ అంత మాటలు ఎందుకన్నారు ? ఎందుకంటే, అందుకు కారణం చంద్రబాబే అని చెప్పాలి. జగన్ అన్నాడని కాదుకానీ ఈమధ్య చంద్రబాబు మాటలు విన్న వారిలో చాలామందికి అదే అనుమానం మొదలైంది. ఈమధ్యనే ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, సముద్రాన్ని జయించేశానని చెప్పారు.

 

తిత్లీ తుపాను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొంత ప్రాంతాన్ని ఎంతలా దెబ్బ తీసిందో అందరికి తెలిసిందే. ఆ సందర్భంగా సహాయ పునరావాస కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఆర్టీసీ బస్సులపైనే కాకుండా అమరావతి ప్రాంతంలో కూడా బాధితుల తరపున చంద్రబాబుకు థ్యాంక్స్ చెబుతూ పెద్ద పెద్ద హోర్డిండులు, పోస్టర్లతో ప్రచారం చేసుకున్నారు.  సహాయం అందించినందుకు బాధితులు థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. తర్వాత ఓసారి మాట్లాడుతూ, సముద్రాన్ని తాను కంట్రోలు చేసినట్లు చెప్పారు. సముద్రాన్ని కంట్రోలు చేయటమేంటో అర్ధంకాక టిడిపి తమ్ముళ్ళే ఖంగుతిన్నారు.

 

అంతకుముందు హుద్ హుద్ తుపాను సందర్భంగా కూడా సముద్రాన్ని జయించేశానని చెప్పుకున్నారు. తర్వాత రాష్ట్రంలో కరువును తరిమేశానని చెప్పుకున్నారు. వెంటనే 400 మండలాలు కరువుతో అల్లాడుతున్నట్లు కేంద్రానికి నివేదిక పంపారనుకోండి అదివేరే సంగతి. అదే సమయంలో దోమలపై యుద్ధం ప్రకటించారు. దోమలపై యుద్ధం ప్రకటించటమేంటో ఎవరికీ అర్ధంకాలేదు. మొన్నటికిమొన్న ప్రకృతి విపత్తులపై ఇస్రో చేసే హెచ్చరికలకన్నా తాను డెవలప్ చేసిన సాంకేతికత వల్ల కచ్చితమైన సమాచారం వచ్చిందన్నారు. చంద్రబాబు సొంతంగా సాంకేతిక వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటమేంటో అర్ధం కావటం లేదు.

 

ప్రకృతి విపత్తులపై అందుతున్న సమాచారం అంతా శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్ధే ఆధారం. శాటిలైట్ వ్యవస్ధ అంటే దేశం మొత్తానికి ఒకటే ఉంటుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాలు తమ అవసరాలకు అందులోనే ఓ స్లాట్ తీసుకునే అవకాశం ఉంది. అంతమాత్రానా ఆ రాష్ట్రం సొంతంగా వ్యవస్ద ఏర్పాటు చేసుకున్నట్లు కాదు. మరి ఇంతచిన్న విషయం 40 ఇయర్స్ అనుభవమని చెప్పుకునే చంద్రబాబుకు తెలీకుండానే ఉంటుందా ?  ఇలా చెప్పుకుంటూపోతే చాలా విషయాలే ఉన్నాయి చంద్రబాబు గురించి. అందుకనే చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలని జగన్ అన్నది.