ఉమ్మడి పౌరస్మృతి వ్యవహారం… జగన్ లాజికల్ క్లారిటీ!

ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే స్పందిస్తారనే పేరు జగన్ కి ఉందని అంటుంటారు. ఎలా బడితే అలా మాట్లాడటం, విషయం తెలుసుకోకముందే విరుచుకుపడటం, ఆనాక నాలుక కరుచుకోవడం వంటివి జగన్ స్టైల్ కాదని చెబుతుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఉమ్మడి పౌరస్మృతిపై స్పందించారు జగన్.

ఉమ్మడి పౌరస్మృతికి తాము పూర్తి వ్యతిరేకంగా అంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లా కమిషన్ కు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇదే సమయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశమైన జగన్… ఉమ్మడి పౌరస్మృతిపై తనదైన శైలిలో స్పందించారు.

అవును… ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. వైసీపీ లాంటి పార్టీల సపోర్ట్ కూడా కేంద్రానికి అవసరం. ఈ దశలో పౌరస్మృతిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, మైనార్టీ నాయకులతో సమావేశమైన సీఎం జగన్.. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తన అభిప్రాయాన్ని వారికి వివరించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

“ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదు” అని జగన్… ముస్లిం మతపెద్దలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో అసలు డ్రాఫ్ట్ కూడా రెడీ అవలేదని, అందులో ఎలాంటి అంశాలుంటాయో కూడా ఎవరికీ తెలియదని, ఈ దశలో భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జగన్.

ఈ సమయంలో… “ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను.. మీరే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో ఆలోచన చేసి సలహా ఇవ్వండి” అంటూ వ్యూహాత్మకంగా సూచించారని తెలుస్తుంది. భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలోని చట్టాల్లో మార్పులు అవసరం అనుకుంటే… ఆ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు జగన్. దీంతో ఉమ్మడి పౌరస్మృతి విషయంలో జగన్ తన క్లారిటీలో తాను ఉన్నాడని అంటున్నారు పరిశీలకులు.