శ్రీకాకుళం ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వద్ద సభతో వైసిపి అధినేత ప్రతిపక్ష నేత ప్రజాసంకల్పయాత్ర జయప్రదంగా ముగిసింది.
ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన జననేత చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో దాకా సుదీర్ఘంగా , నిరాటంకంగా సాగింది.
మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర లో 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. ఆయన 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 123 సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్ పాదయాత్రలో అఖరి బహిరంగ సభలో ప్రసంగించారు.
ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు, ఎంత మందిని కలిశామన్నది ముఖ్యమని, ప్రజలతో మమేకం అయ్యేందుకు, ప్రజల మధ్య ఒకడిగా ఉండేందుకు తాను యాత్రం చేపట్టానని చెప్పారు. ఆమాటకొస్తే కాశ్మీర్-కన్యాకుమారి (2856 కిమి) కన్నా, హైదరాబాద్ -దుబాయ్ దూరం (2548 కిమీ) కన్నా ఎక్కువ (3648 కి.మీ) నడిచానని, అయితే, అదికాదు, ముఖ్యం ఎంతమందిని కలిశాను, ఎంతమందితో మాట్లాడానన్నది,ఎంతమందికి చేరువయ్యాననేది ముఖ్యమని ఆయన అన్నారు.
ఈ చారిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్రలో దాదాపు కోటిన్నర మందిని స్వయంగా ఆయన కలిశారు. ఇలా ఇంత మందిని ఆప్యాయంగా స్పృశిస్తూ.. వారి కష్టాలు వింటూ.. భరోసా ఇస్తూ.. సాగిన పాదయాత్ర ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిది. జగన్ బహిరంగ సభలకు కొన్ని లక్షల మంది జనం హాజరయ్యారు. బీదా బిక్కీ.. కుమ్మరి, కమ్మరి, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు.. ఇలా ఆ వర్గం ఈవర్గం అనే తేడా లేకుండా సకల వృత్తుల వారినీ, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉపాధి కూలీలను, బడుగు, బలహీన, హరిజన, గిరిజన, మైనార్టీ వర్గాలను, ‘చంద్రబాబు నాలుగేళ్ళ పాలన’లో బాధితులైన, పీడితులైన వారినీ జగన్ మోహన్ రెడ్డి పలకరించారు. తనకంటే చిన్నవారికి అన్నలా.. పెద్దలకు తమ్ముడిలా.. అవ్వాతాతలకు మనవడిగా.. బాధల్లో, కష్టాల్లో ఉన్నవారికి నేనున్నా అనే భరోసా కల్పించారు. ప్రజలందరి ఆశీస్సులతో త్వరలో రాబోతోన్న రాజన్న రాజ్యంలో సమాజంలో ఉన్న ప్రతి వర్గానికీ, ప్రతి కుటుంబానికీ, ప్రతి వ్యక్తికీ న్యాయం జరిగేలా పాలన అందిస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ముగింపు సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను అవిష్కరించారు. అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.