తెలుగుదేశంపార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. టిడిపిలోని చాలామంది నేతలకున్న భద్రతా సిబ్బందిని తొలగించారు. టిడిపి నేతలకున్న గన్ మెన్లను తొలగిస్తు శనివారం రాత్రికే ఆయా జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆదివారం ఉదయానికల్లా మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపిలతో పాటు చాలామంది నేతలకున్న గన్ మెన్లు మాయమైపోయారు.
చంద్రబాబునాయుడు హయాంలో అవసరమున్న లేకపోయినా చాలామంది నేతలు గన్ మెన్లను పెట్టుకున్నారు. ఎందుకంటే గన్ మెన్లను పెట్టుకోవటం చాలామందికి హోదాకు చిహ్నంగా మారిపోయింది. అదే సమయంలో వైసిపిలో ఎంఎల్ఏలు, ఎంపిల భద్రతను కుదించింది ప్రభుత్వం. తమ గన్ మెన్లను కుదించటం అన్యాయమని అప్పట్లో వైసిపి ఎంఎల్ఏలు ఎంత మొత్తుకున్న చంద్రబాబు ఏమాత్రం లెక్క చేయలేదు.
తాజాగా గన్ మెన్ల భద్రతున్న నేతలపై జగన్ జరిపిన సమీక్షలో చాలామందికి అవసరం లేకపోయినా గన్ మెన్లు ఉన్న విషయం బయటపడిందట. దాంతో మరింత లోతుగా సమీక్షించిన ఉన్నతాధికారులు చాలామందికి గన్ మెన్లను ఉపసంహరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆదివారం ఉదయం నుండి గన్ మెన్లు ఆయా జిల్లాల ఎస్పీలకు రిపోర్టు చేశారు.
ఎప్పుడైతే గన్ మెన్లను ఉపసంహరించటం మొదలుపెట్టారో వెంటనే టిడిపి నేతల గోల మొదలైంది. గుంటూరు జిల్లాలో చాలామంది మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపిల భద్రతను కుదించటమో లేకపోతే ఉపసంహరించటమే చేశారు. ఇలా ప్రతీ జిల్లాలోను భద్రతను చాలా వరకూ ఉపసంహరించేశారు. జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఎటువంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాల్సిందే.