దూకుడు మీదున్న జగన్

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి మంచి దూకుడు మీదున్నాడు. ఒకవైపు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తు మరోవైపు ఉన్నతాధికారులను ఉరుకులెత్తిస్తున్నారు.  అదే సమయంలో సమీక్షలు చేస్తు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాజాగా జరిగిన కలెక్టర్ల రెండు రోజుల సమావేశంలో ప్రజావేదికను కూలగొట్టేయటం, విద్యుత్ రంగానికి సంబంధించి  సోలార్, విండ్ పవర్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని తేల్చేశారు. జరిగిన రూ. 2230 కోట్ల అదనపు చెల్లింపులను బాధ్యుల నుండి రికవరీ చేయాలని నిర్ణయించారు.

ఇక్కడ బాధ్యులంటే ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబునాయుడు, ఒప్పందాలపై సంతకాలు చేసిన మంత్రి, ఉన్నతాధికారులున్నమాట. నిజానికి రికవరీ అన్నది జరిగే పనికాదు. తెలిసికూడా  రికవరీకి జగన్ ఆదేశాలిచ్చారంటే చంద్రబాబును ఫిక్స్ చేయటమే ఉద్దేశ్యంగా కనబడుతోంది.

ఒకవేళ వారినుండి రికవరి సాధ్యం కాకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జగన్ స్పష్టంగా ఆదేశించారు. అంటే అదనపు చెల్లింపులు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. నిరూపించలేకపోతే డబ్బులు కట్టాల్సిందే. కట్టలేకపోతే న్యాయపరమైన చర్యలకు తలొంచాల్సుంటుంది. మొత్తానికి అధికారంలోకి వచ్చిన నెలకే జగన్ ఇంత దూకుడు ప్రదర్శిస్తున్నారు.