విపక్ష సభ్యులందు.. స్వపక్షంలోని విపక్ష సభ్యులు వేరయా అని అనుకోవాల్సిన పరిస్థితి ఏపీ అధికారపార్టీకి ఎదురైంది. గతకొన్ని రోజుల క్రితం అధికారపార్టీపై అలిగి, అనంతరం ఫైరయ్యి దూరం జరిగిన కోటం రెడ్డే ప్రస్తుతం ఈ పరిస్థితికి కారణం! అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యులకంటే విభిన్నంగా కోటంరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలుపుతున్నారు.
ఏపీ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ బాయ్ కాట్ చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే! సీఎం అయితే నే సభకు వస్తానని.. అప్పటివరకూ ప్రజా సమస్యలను పట్టించుకోనని అసెంబ్లీనుంచి బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు హాజరుకాకపోవడంతో… టీడీపీ తరపున పెద్దగా ప్రతిస్పందన ఉండటం లేదని విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ దశలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాత్రం.. ఆ పాత్ర పోషిస్తూ.. సీఎం జగన్ కి తలనొప్పిగా మారారు. రెండోరోజునుంచే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో రెడీ అయ్యారు.
అవును… నెల్లూరు రూరల్ సమస్యలపై కోటంరెడ్డి “పోరుబాట” మొదలు పెట్టారు. అసెంబ్లీ సెషన్స్ ముందురోజు వరకు నెల్లూరులోనే సాగిన ఆయన పోరాటం.. తాజాగా అమరావతికి చేరింది. ఇందులో భాగంగా.. వెలగపూడి గ్రామం నుంచి అసెంబ్లీకి ప్లకార్డ్ చేతబట్టుకుని పాదయాత్ర చేస్తూ వచ్చారు లోటంరెడ్డి. అనంతరం అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ప్రస్థావించిన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని నొక్కి వక్కానించారు.
నెల్లూరు రూరల్ సమస్యలపై తాను అధికారులు, మంత్రులు, స్వయానా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయానని మొదలుపెట్టిన కోటంరెడ్డి… సమస్యలపై నిలదీస్తే తనను దూరం పెట్టారని, తనపై నిఘా పెట్టి ఇబ్బందులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా… అసెంబ్లీలో తన ఆవేదన వెళ్లబుచ్చుతానని… అందుకు అవకాశం లేకుండా తనకు మైక్ ఇవ్వకపోతే ప్లకార్డ్ పట్టుకుని అసెంబ్లీ జరిగినంతసేపు నిలబడే ఉంటానని స్పష్టం చేశారు కోటంరెడ్డి!
తాజాగా అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై కోటంరెడ్డి స్పందిస్తుండగా… ఏపీ మంత్రులు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా స్పందించిన అంబటి రాంబాబు… కోటంరెడ్డి నమ్మకద్రోహి అని, టీడీపీ కోసమే ఆయన పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందిస్తూ… వ్యక్తిగత సమస్యలకు అసెంబ్లీలో చోటులేదని, ప్రజాసమస్యలు ఏమైనా ఉంటే ప్రస్థావించొచ్చని సూచించారు!
ఈలెక్కన చూసుకుంటే… సెషన్స్ స్టార్ట్ అయిన రెండోరోజే కోటంరెడ్డి ఇలా జగన్ కి తలనొప్పిగా మారితే… ముందు ముందు ఇంకెంత నొప్పి తెప్పిస్తారన్నది వేచి చూడాలి!