చంద్రబాబునాయుడు హయాంలో వైట్ ఎలిఫెంట్ గా మారిపోయిన కన్సల్టెన్సీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి వదిలించుకున్నది. అవసరం ఉన్నా లేకపోయినా చంద్రబాబు హయాంలో చాలా కన్సల్టెన్సీలను నియమించుకున్నారు. సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ అథారిటిలోనే కాకుండా ఇరిగేషన్ శాఖ, రోడ్లు భవనాలు లాంటి అనేక శాఖల్లో కూడా ఇలాంటి వైట్ ఎలిఫెంట్లు తిష్ట వేశాయి. ఇటువంటి వైట్ ఎలిఫెంట్లో విదేశాలనుండి వచ్చినవి కూడా ఉండటమే విచిత్రంగా ఉంది.
రాజధాని నిర్మాణమని, అమరావతి డిజైన్లని చంద్రబాబు తనిష్టం వచ్చినట్లు వందలాది కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో దారపోశారు. అమరావతి డిజైన్లకే పేరుతోనే సుమారు రూ. 300 కోట్లు చెల్లించారంటేనే దుబారా ఏ స్ధాయిలో జరిగిందో అర్ధమవుతోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్కిటెక్టలను ఆహ్వానించి చివరకు బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ అనే ఆర్కిటెక్ట్ ఇచ్చే డిజైన్లు ఓకే చెప్పారు. కానీ చివరకు వచ్చేసరికి రాజమౌళి నిర్మించిన బాహుబలి సినిమా సెట్టింగులపై మక్కువ చూపారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దుబారా ఖర్చులకు కోత విధిస్తున్నారు. ఇందులో భాగంగా కన్సల్టెంట్లు, సలహాదారులు ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనే విషయాన్ని ఆరాతీశారు. వివరాలు సేకరించిన వారికి దిమ్మతిరిగిపోయిందట. సిఆర్డీఏ, ఏడిఏ ల్లోనే సుమారు 30 కన్సల్టెన్సీలు పనిచేస్తున్నట్లు లెక్క తేలింది. ఇటువంటి వాటికి చంద్రబాబు సర్కార్ సుమారుగా రూ. 460 కోట్లు చెల్లించిందంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది.
ఇటువంటి తెల్ల ఏనుగులన్నింటినీ జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా మంగళం పాడేసింది. పేరుకే కన్సల్టెన్సీలే కానీ శాఖల ఉన్నతాధికారులకు మించి అధికారాలను అనుభవించింది వాస్తవం. రిటైర్డ్ ఐఏఎస్ లను కూడా సలహాదారులుగా నియమించుకుని లక్షల రూపాయలు ఫీజులు చెల్లించిన విషయం బయటపడింది. మొత్తానికి ఇప్పటికైనా కన్సల్టెన్సీలకు మంగళం పాడటం మంచి పరిణామమే.