గేరు మార్చమంటున్న జగన్

అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి సభ్యుల కట్టడికి జగన్మోహన్ రెడ్డి రెండంచల వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించారు. మొదటిది టిడిపి లేవనెత్తుతున్న ప్రశ్నలకు ధీటైన సమాధానాలు ఇవ్వటం. ఇక రెండోది ఎదురుదాడి చేసే సమయంలో సమాధానం చెప్పుకోలేని స్ధితిలోకి టిడిపిని కార్నర్ చేయటం. ఈ రెండు అంశాలపై అసెంబ్లీలో చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తు వైసిపి గేరుమార్చాలని జగన్ సూటిగా ఆదేశించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యులను ఇబ్బంది పెట్టేలా ప్రధానంగా  చంద్రబాబును ఇరుకున పెట్టేలా చూడాలని జగన్ మంత్రులు, ఎంఎల్ఏలను ఆదేశించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు కొన్నిసార్లు మంత్రుల సమాధానాలు తేలిపోతున్నాయి. అదే సమయంలో సంఖ్యాపరంగా టిడిపి తక్కువే అయినా పూర్తి సామర్ధ్యంతో సభ్యులు పనిచేస్తున్నారు.

టిడిపికి మెజారిటి మీడియా మద్దతు పూర్తిస్ధాయిలో పనిచేస్తున్న విషయం వైసిపి గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ వార్తల కవరేజీలో కూడా చంద్రబాబు మీడియా జగన్ లేదా వైసిపి కన్నా టిడిపి సభ్యుల కవరేజీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. కాబట్టి టిడిపి సభ్యుల ప్రశ్నలకు కానీ చర్చల విషయంలో కానీ ఏమాత్రం అలసత్వం చూపినా టిడిపి మీడియా గోరంతను కొండతలుగా చూపిస్తుంది.

అందుకనే మంత్రులు, ఎంఎల్ఏలకు జగన్ అంత గట్టిగా టార్గెట్ గురించి చెప్పాల్సొచ్చింది. పోలవరం, విద్యుత్, పరిశ్రమలు, పెట్టుబడుల కోసం చంద్రబాబు విదేశీయానాలు తదితర అంశాలపై మంత్రులు, ఎంఎల్ఏలు సమర్ధవంతంగానే పని చేస్తున్నారు. అయినా గేరు మార్చమని జగన్ చెబుతున్నారంటే వైసిపి సభ్యులు ఏ స్ధాయిలో రెచ్చిపోతారో చూడాలి.