తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఊ అంటే చంద్రబాబునాయుడుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న జగన్మోహన్ రెడ్డి మాట అక్షర సత్యం. ఎందుకంటే 175 ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో వైసిపికి 151 సీట్లు వస్తే టిడిపికి దక్కింది 23 మాత్రమే.
అసెంబ్లీలో 17 మంది ఎంఎల్ఏలున్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం టిడిపికి 23 మంది ఎంఎల్ఏలున్నారు. అయితే మొన్నటి ఫలితల తర్వాత కొందరు టిడిపి ఎంఎల్ఏలు వైసిపిలోకి వచ్చేస్తానని కబురు చేశారట. అయితే అందుకు జగన్ నిరాకరించారు. టిడిపి ఎంఎల్ఏలను వైసిపిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.
ఫిరాయింపులకు జగన్ నిరాకరించటంతో టిడిపి ఎంఎల్ఏలు వెనక్కుతగ్గారు. జగన్ గనుక ఊ అనుంటే ఓ పదిమంది ఎంఎల్ఏలు గోడ దూకేస్తే టిడిపికి ప్రధాన ప్రతిపక్ష హోదా గోవిందా. అదే విషయాన్ని జగన్ ఈరోజు సభలో స్పష్టం చేయటం గమనార్హం.
ఫిరాయింపులపై జగన్ ఆ మాట చెబుతున్నపుడు చంద్రబాబు నవ్వలేక ఏడుస్తున్నట్లు మొహం పెట్టారు. పైగా టిడిపి నుండి చేతనైతే ఎంఎల్ఏలను లాక్కో అన్నట్లుగా మొహంలో హావభావాలతో రెట్టించేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ కలగ చేసుకోవటంతో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది.