ఏపిలో రాజకీయాలు చాలా విచిత్రంగా మారిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో అఖండమైన మెజారిటితో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటాన్ని చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారు. అందుకే అవకాశం కల్పించుకుని మరీ జగన్ పై బురద చల్లేస్తున్నారు. ఎలాగూ మీడియా మద్దతు ఉంది కాబట్టి బురద చల్లుడు కార్యక్రమంలో మరింతగా రెచ్చిపోతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా కాపులకు రిజర్వేషన్ అంశమే తీసుకుందాం. అధికారంలో ఉన్నపుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించటాన్ని సుప్రింకోర్టు కొట్టేసింది. అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. అయితే చంద్రబాబు మాత్రం పదిశాతంలో కాపులకు 5 శాతం సబ్ కోటా పెట్టారు. దానిపై కొందరు కోర్టుకెళ్ళగా సుప్రింకోర్టు తీర్పులో సబ్ కోటాను కొట్టేసింది. అయితే టిడిపి నేతలు మాత్రం కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. పైగా కాపు రిజర్వేషన్ కు జగన్ వ్యతిరేకమంటూ ప్రచారం మొదలు పెట్టారు.
ఇక పోలవరం, విద్యుత్ పిపిఏల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలపై జగన్ సమీక్షలు చేయమని కమిటిలను వేశారు. దానిపైన కూడా చంద్రబాబు మండిపోతున్నారు. జగన్ చర్యల వల్ల ఏపి బ్రాండ్ ఇమేజి పడిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న ఆందోళనే కనబడుతోంది.
రివర్సు టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి కాంట్రాక్టుల ధరలు తగ్గిస్తానని ప్రభుత్వానికి ఆదా చేస్తానని జగన్ చెబుతున్నారు. అయితే రివర్స్ టెండరింగ్ విధానం వల్ల కాంట్రాక్టు సంస్ధలేవీ పనులు చేపట్టటానికి ముందుకు రావటం లేదంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. అమ్మఒడి, గ్రామ సచివాలయాలు, ఇళ్ళ నిర్మాణాలు..ఇలా విషయం ఏదైనా కానీండి జగన్ చేస్తున్న ప్రతీ పనిపైనా బురద చల్లటమే పనిగా చంద్రబాబు అండ్ కో పెట్టుకున్నారు. తమకున్న మీడియా బలంతో చంద్రబాబు చల్లుతున్న బురదను తుడుచుకోవటానికే జగన్ కు సమయం సరిపోతోంది.