విజయనగరం జిల్లాపై జగన్ ఫోకస్: బరిలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. 2019 లో అధికార పీఠమే లక్ష్యంగా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు జగన్ పాదయాత్రను మొదలుపెట్టారు. అంతేకాదు ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాను పర్యటించిన నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల ఇంచార్జీలపై ప్రత్యేక దృష్టి సారించారు. తాను పర్యటించిన నియోజకవర్గాల్లో సమన్వయకర్తల సామర్ధ్యం, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. ఇంచార్జిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నా, టికెట్ ఆశించిన క్యాండెట్ వీక్ అని తెలిసినా వెంటనే అభ్యర్థులను తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైసీపీలో ప్రకంపనలే వెల్లువెత్తాయి. అయినప్పటికీ జగన్ ఒత్తిడులకు తలొగ్గకుండా గెలుపుగుర్రాలకే టికెట్ కేటాయించారు. కొన్నిచోట్ల సర్దుకుపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జిల మార్పులపై అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. కానీ జగన్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ముందుకు పోతున్నారు. ప్రతి సీటు ఇంపార్టెంట్ కావటంతో జగన్ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ కూడా ఇంచార్జిల మార్పులుపై దృష్టి సారించారు జగన్.

జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు అయిన పెనుమత్స సాంబశివరాజు తనయుడు సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) వైసీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన ఓటమి తర్వాత నియోజకవర్గ బాధ్యతలను తన తండ్రి పెనుమత్స సాంబశివరాజుకు అప్పగించారు. పెనుమత్స ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలో కూడా పని చేశారు. ఆయన వైసీపీ తొలినాళ్ళ నుండి పార్టీకి అండగా ఉన్నారు. కాగా వృద్ధాప్యం పైబడటంతో ప్రచారంలో చురుకుగా పాల్గొనే అవకాశం కనిపించడం లేదు.

ఈ తరుణంలో రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి బడ్డుకొండ అప్పలనాయుడిని బరిలోకి దించేందుకు జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగా పెనుమత్సను తప్పించి నెల్లిమర్ల సమన్వయకర్తగా అప్పలనాయుడుని నియమించారు అని టాక్. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుండి వైసీపీలోకి వైసీపీలోకి వచ్చారు అప్పలనాయుడు. ఈయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నెల్లిమర్ల నుండి ఎన్నికల బరిలో నిలబడ్డారు. టీడీపీ అభ్యర్థి నారాయణస్వామి నాయుడుపై స్వల్ప ఆధిక్యం 597 ఓట్లతో గెలుపొందారు. కాగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశారు.