పాదయాత్రలో చెప్పినట్లుగానే అవ్వా, తాతలు, అక్క చెల్లెళ్ళ నెలవారి పెన్షన్ ను 2250 రూపాయలకు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకం చేశారు. రేపటి జూన్ 1వ తేదీ నుండే అమల్లోకి వస్తుందని జగన్ వేదిక మీద నుండే ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 4 లక్షల గ్రామ వాలంటీర్లను నియమిస్తానని చెప్పారు.
ప్రమీణ స్వీకారం చేసిన తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనే తన పరిపాలన ఎలా ఉండబోతోంది అనే విషయమై జగన్ స్పష్టమైన సందేశాన్నే ఇచ్చారు. లంచాలు లేని వ్యవస్ధ ఉండాలని కోరుకున్నారు. అవసరాల మేరకు ఉద్యోగాలను భర్తీ చేసుకుంటు వెళతానన్నారు. గ్రామ సచివాలయాలను బలోపేతం చేయటం ద్వారా లంచాలను నియంత్రిస్తానన్నారు.
రేషన్ కార్డులు, పెన్షన్లు లాంటి సంక్షేమ ఫలాలను అందుకునేందుకు పేదలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్వచ్చమైన, అవినీతి లేని, వివక్ష లేని పాలన అందించాలన్నదే తన ధ్యేయంగా చెప్పుకున్నారు. అందుకు అవసరమైన ప్రక్షాళన చేస్తానని మాటిచ్చారు. ఎక్కడెక్కడైతే అవినీతికి అవకాశం ఉందో ఆ కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.