పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని అష్టదిగ్భంధనం చేసే దిశగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా పిఠాపురం విషయంలో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారని.. పవన్ కు ఊపిరాడనివ్వకుండా విలవిల్లాడేలా చేయాలనే రేంజ్ లో స్కెచ్ వేశారని అంటున్నారు. ఇందులో ప్రధానంగా… పార్టీ అధినేతగా రాష్ట్రమంతా పర్యటించాల్సిన పవన్ ని పిఠాపురానికే పరిమితం చేయడం అందులో మొదటిదని అంటున్నారు.
అవును… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాష్ట్రం మొత్తం ప్రచారానికి వాడుకోవాలని, ఈ సమయంలో ఆయన క్రౌండ్ పుల్లర్ గా ఉపయోగపడతారని బాబు & కో భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే… పవన్ కు ఆ ఛాన్స్ లేకుండా కేవలం పిఠాపురానికి మాత్రమే పరిమితం చేయాలని, పిఠాపురాన్ని వదిలి బయటకు వెళ్లే పరిస్థితి పవన్ కు లేకుండా చేయాలని.. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేయాలని జగన్ స్కెచ్ వేశారని తెలుస్తుంది.
పిఠాపురంలో పవన్ పైకి వంగ గీతను పోటీకి నిలబెట్టింది వైసీపీ. ఇదే సమయంలో గోదావరి జిల్లాల సమన్వయ కర్త మిథున్ రెడ్డి.. పిఠాపురంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇదే సమయంలో… కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబ్బాబు సైతం పూర్తిశ్రద్ధ పిఠాపురంపై పెట్టేలా ప్లాన్స్ చేశారని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రచారం చేయాలని, వ్యూహాలు రచిస్తున్నారు.
ఇంతమంది భారీ టీం గ్రౌండ్ లోకి దిగితే పవన్ కు చాలా కష్టం అనేది పలువురు చెబుతున్న మాట. కారణం… పిఠాపురంలో పవన్ గ్రౌండ్ లెవెల్ లో ఇప్పటివరకూ చేసిన కార్యక్రమాలు శూన్యం అని అంటున్నారు. పైగా పిఠాపురం జనసేన నేతలు వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు. ఇక టీడీపీ ఇంఛార్జ్ వర్మ నేతృత్వంలోనే పవన్ పనిచేసుకోవాల్సిన పరిస్థితి! పైగా జనసేన నేతలు, కార్యకర్తల స్థాయి ఏమిటో తాడేపల్లి గూడేం జెండా సభలో పవన్ స్పష్టంగా చెప్పిన పరిస్థితి.
ఇక ఓటర్ల విషయానికొస్తే… పిఠాపురంలో సుమారు 92వేల కాపు ఓట్లు ఉన్నాయని అంటున్నారు. ఇందులో 60శాతం జనసేనకు వెళ్లినా.. 40 శాతం వైసీపీ దక్కితే చాలనేది జగన్ స్కెచ్ గా చెబుతున్నారు. మిగిలిన వారిలో ఎస్సీ, బీసీల ఓట్లు సుమారు లక్షా నలభైవేల వరకూ ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ గెలవాలంటే… కనీసం లక్ష ఓట్లు పైన వచ్చి తీరాలి. దీంతో… ఎస్సీ, బీసీ ల ఓట్లతో పాటు కాపు ఓట్లలో 30 – 40 శాతం సాధించగలిగితే… పవన్ ను ఓడించడం పెద్ద మేటర్ కాదని జగన్ & కో భావిస్తున్నారని చెబుతున్నారు.
ఇదే క్రమంలో… గతంలో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ పిఠాపురంలో వంగగీతకు రావాలన్ని మరో స్కెచ్ అని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ నెలలో పిఠాపురంలో జగన్ బస్సు యాత్ర ఉండబోతుండగా.. ఒక రోజంతా అక్కడే ఉండి, స్థానిక ద్వితీయ శ్రేణి నేతలతోనూ జగన్ గట్టిగా చర్చించనున్నారని అంటున్నారు. ఇలా పిఠాపురంలో పవన్ ని అష్టదిగ్భందనం చేసే దిశగా జగన్ పావులు కదుపూతున్నారని అంటున్నారు. మరి వీటికి విరుగుడుగా పవన్ ఏమి చేయబోతున్నారనేది వేచి చూడాలి!