జగన్ పిచ్చివానిలా ప్రవర్తిస్తున్నారు: ఏపీ మంత్రి గంటా

వైసిపి చేపట్టిన బంద్ విఫలమైందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసిపి మీద నమ్మకం లేకనే ఇతర పార్టీలవారు కూడా బంద్ కు మద్దతు ఇవ్వలేదని, పార్లమెంటులో టిడిపి ఎంపీలు కేంద్రాన్ని నిలదీసిన తర్వాత వైసిపి బంద్ కు పిలుపునివ్వడం మంచి పద్దతి కాదన్నారు. బంద్ వల్ల ఆర్టీసికి 13 కోట్లు, రాష్ట్ర ఖజానాకు 70 కోట్ల రూపాయల నష్టం తప్ప ఏమి లాభం లేదని ఆయన విమర్శించారు. జగన్ కు రాజకీయానుభవం లేక రిపబ్లిక్ డే రోజున బంద్ కు పిలుపునిచ్చి విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ ఏం చేస్తున్నాడో తనకే అర్ధం కాక పిచ్చివానిలా ప్రవర్తిస్తున్నారన్నారు.

మోదీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తున్నారని గుజరాత్ లో పటేల్ విగ్రహానికి 3000 కోట్లు, ముంబైలో శివాజీ విగ్రహా నిర్మాణానికి 2500 కోట్లు కేటాయించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మాత్రం 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది  న్యాయమేనా అని గంటా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 15 కొత్త రైల్వే జోనులు ప్రకటిస్తే విశాఖకు మాత్రం రైల్వే జోన్ ఇవ్వకుండా మొండి చేయి చూపారని దుయ్యబట్టారు. దేశంలో అన్ని రైల్వే జోన్లకన్నా విశాఖ రైల్వే జోన్ చాలా ప్రాధాన్యత కలది. విశాఖకు మాత్రం మొండి చేయి చూపారన్నారు. టిడిపి రాజకీయంగా నష్టపోయినా రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిజెపితో పొత్తు పెట్టుకున్నామన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీని బైకాట్ చేయటం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు. 2019లో బిజెపికి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు.