ఎప్పుడైతే తెలుగుదేశంకి సంబంధించిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరారో అప్పటి నుండి ఫిరాయింపుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయాలు మారడం మొదలైంది.
ఇన్నాళ్లు మా అభివృద్ధి చూసి వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు అని చెబుతూ వచ్చిన నాయకులు ఇప్పుడు అది తప్పే అని చెప్పడం ప్రారంభించారు.
ఒక పాత్రికేయుడు బిజెపి మీ ఎంపీలను తీసుకొని ఈ రాష్ట్రంలో బలపడాలని చూస్తుంది కదా మీరు ఎలా స్పందిస్తారు అని అడగగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు “23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నాము అయితే ఎలక్షన్లో ఏమైంది” అని ఎదురు ప్రశ్నించాడు.
అలాగే మరొక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహన్రావు చర్చలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ” మేము 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పే అలాంటి వాటిమీద చర్చ జరగాలి వీటికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడాలి” అని తన అభిప్రాయం వెలిబుచ్చారు
పార్టీ ఫిరాయింపులు విషయంలో తన దగ్గరకు వస్తే కానీ తెలుగుదేశం పార్టీకి నొప్పి అర్థం కాలేదు. ఇప్పటికైనా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీ అలవాటు చేసుకోవాలి. అది తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు ప్రజాస్వామ్యానికి మంచి చేస్తుంది.