విచారణలో సిట్ ఫెయిల్ అయ్యిందా ?   నిందితునికి ప్రాణహానట..

కస్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ ఐదు రోజులుగా తమకు ఏ విషయాలు చెప్పటం లేదని సాక్షాత్తు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారి మహేష్ చంద్ర లడ్డా చెబుతుండటం విచిత్రంగా ఉంది. ఈనెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి పై శ్రీనివాస్ హత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. ఏదో అదృష్టం కొద్దీ జగన్ బయటపడ్డారు. లేకపోతే ఈరోజుకు ఆరోరోజయ్యేది. సరే జగన్ పై దాడి జరగ్గానే నిందితుడిని పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కథ చాలా మలుపులు తిరిగినా మొత్తానికి చంద్రబాబునాయుడు హత్యాయత్నం ఘటనపై సిట్ విచారణకు ఆదేశించారు.

ఇపుడా సిట్ అధికారి మహేష్ చంద్ర లడ్డా  చెబుతున్నదే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐదు రోజులుగా నిందితుడు ఏ విషయమూ చెప్పటం లేదట. నిందితుడు చెప్పటం లేదు సరే, మరి పోలీసులు ఏం చేస్తున్నట్లు ? కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తున్నారా ? మామూలు జేబుదొంగలో లేకపోతే చిల్లర దొంగలో పట్టుబడినపుడు వారిని చావగొట్టి నిజాలు (?) చెప్పిస్తారు కదా ? తప్పు చేసిన వారి ఎప్పుడైనా తాను తప్పుచేశానని అంగీకరించినట్లు పోలీసుల హిస్టరీలో చూశారా ? ఇక్కడ జగన్ పై హత్యాయత్నానికి దిగటం అందరూ చూశారు.  

అందరూ చూసిన విషయం కాదు ఇపుడు బయటకు రావాల్సింది. జగన్ పై హత్యకు శ్రీనివాస్ ను ప్రేరేపించింది ఎవరు ? ఎందుకు ప్రేరేపించారు ? ఎప్పటి నుండి ప్లాన్ వేస్తున్నారు ? హత్య కుట్రలో భాగస్దులెంతమంది ? అన్న విషయాలు బయటకు రావాలి. విచారణలో సిట్ తేల్చాల్సింది కూడా అదే. లడ్డా చెబుతున్నట్లు నిందితుడు ఏమీ మాట్లాడటం లేదని అంటున్నారంటే సిట్ విచారణ ఫెయిల్ అయినట్లే కదా ? పైగా అనారోగ్యంగా ఉందని నిందితుడు అనగానే పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

ఆసుపత్రిలోని కాజువాలిటీలోకి తీసుకెళ్ళే సమయంలో తన ప్రాణాలకు హాని ఉందని నిందితుడు గట్టిగా కేకలు వేశాడు. అంటే ఏమనర్ధం ? పోలీసుల కస్టడీలో ఉన్న శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందన్నాడంటే ఎవరిని అనుమానించాలి ? ఈ విషయాలన్నింటినీ అనుమానించబట్టే వైసిపి నేతలు రాష్ట్రప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదని వాదిస్తున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్ధతో కానీ లేకపోతే జ్యుడీషియల్ విచారణ కానీ చేయించాలని డిమాండ్ చేస్తున్నది. మొత్తానికి విచారణ విషయంలో తాజాగా లడ్డా చెబుతున్నది చూస్తుంటే వైసిపి డిమాండ్ చేస్తున్నదే నిజం అయ్యేట్లుంది.