తెలుగుదేశం పార్టీ అధినేతకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. లెక్కల్లో తేలని 118 కోట్ల వ్యవహారానికి సంబంధించిన నోటీసులు ఇవి. అమరావతి ప్రాజెక్టు పేరుతో జరిపిన నిర్మాణాల్లో కొన్నింటికి సంబంధించి చంద్రబాబుకి ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ.
ఐటీ శాఖ నోటీసులు.. చంద్రబాబు సమాధానాలు.. ఇదంతా గత కొన్నాళ్ళుగా చాటుమాటుగా నడుస్తున్న కథ. అనూహ్యంగా వైసీపీ, ఈ అంశానికి విపరీతమైన పొలిటికల్ మైలేజ్ ఇస్తోంది. వారాహి విజయ యాత్ర సూపర్ సక్సెస్ అయిన దరిమిలా, జనసేన ఇమేజ్ పెరిగిందనీ, దాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందన్నది జనసేన పార్టీ ఆరోపణగా కనిపిస్తోంది.
ఇక, వైసీపీ అయితే, ‘దత్త పుత్రుడు’ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడంలేదు.? దత్త తండ్రి అడ్డంగా దొరికిపోయాడు కదా.. అందులో దత్త పుత్రుడికీ వాటా వుంది.! అంటూ ఆరోపణలు చేస్తుండడం చూస్తున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఒకరేమిటి, ముఖ్యమంత్రి తప్ప.. దాదాపుగా వైసీపీలో అందరిదీ ఒకటే వరస.!
పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఎంత.? స్పందించకపోతే ఎంత.? పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే, ఐటీ శాఖ, చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకుంటుందా.? కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబుని జైలుకు పంపుతుందా.? రాష్ట్రంలోని వైఎస్ జగన్ సర్కారు చంద్రబాబుని కటకటాల వెనక్కి పంపిస్తుందా.?
నిజానికి, పవన్ కళ్యాణ్ స్పందించి వుంటే, కాస్తో కూస్తో జనసేన పార్టీ పట్ల ప్రజల్లో ఇంప్రెషన్ కొంత పాజిటివ్‌గా పడేదేనేమో! ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్, ఇప్పుడెందుకు ఈ విషయంలో ప్రశ్నించలేదన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. అదే విషయాన్ని వైసీపీ ప్రస్తావించడం తప్పు కాదు.
కానీ, మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఇక తమకు వేరే పనేమీ లేదన్నట్టు, పవన్ కళ్యాణ్ జపం చేస్తే ఏం లాభం.? పరోక్షంగా ఇది పవన్ కళ్యాణ్‌కి పాజిటివ్‌గా మారుతోంది.