టీడీపీతో స్నేహం కుదరని పని: తేల్చేసిన బీజేపీ

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసే అవకాశమే లేదని తేల్చేశారు బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్. ‘చంద్రబాబు ఢిల్లీకి వచ్చారా.?’ అంటూ వెటకారంగా ప్రశ్నించారు సునీల్ దేవధర్. ఇదొక్కటి చాలు, చంద్రబాబుని బీజేపీ ఎంత లైట్ తీసుకుంటుందో చెప్పడానికి.

సునీల్ దేవధర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే, టీడీపీ అధినేత చంద్రబాబుకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. జమ్మూకాశ్మీర్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన అమిత్ షా, చంద్రబాబుని కలవలేకపోవడానికి గల కారణాల్ని వివరించారట. చంద్రబాబు, రాష్ట్రంలోని పరిస్థితుల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి వివరించారట. అలాగని టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండి వడ్డించింది.

నిజానికి, ఢిల్లీలో ఒకప్పుడు బోల్డంత పలుకుబడి కలిగి వున్న చంద్రబాబు, ఈసారి నిస్తేజంగా ఢిల్లీ యాత్ర పూర్తి చేసుకుని వచ్చారు. రాష్ట్రపతికి రాష్ట్రంలో పాలన విషయమై పిర్యాదు చేశారు చంద్రబాబు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, టీడీపీ ఫిర్యాదుపై ఎలా స్పందించారన్నదానిపై అసలు ఇప్పటిదాకా స్పష్టత లేదు.

కానీ, అమరావతి గురించి రాష్ట్రపతి కోవింద్ అడిగారంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలొచ్చాయి. ఇంకోపక్క, బీజేపీతో ‘కలిసి పనిచేసేందుకు’ చంద్రబాబు ఉవ్విళ్ళూరుతున్న వైనం, ఆ దిశగా బీజేపీ – టీడీపీలను కలిపేందుకు టీడీపీ అనుకూల మీడియా నానా పాట్లూ పడుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అయితే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. బీజేపీకి అవసరం అనుకుంటే టీడీపీ – బీజేపీ కలిసేందుకు మార్గం అనుకోకుండా సుగమం అయిపోతుందంతే.