ఏపీలో రాజకీయాలు పార్టీల మధ్యన జరగటం లేదు, ఎన్నికల కమిషన్, వైసీపీ ప్రభుత్వం మధ్యన రాజకీయాలు నడుస్తున్నాయి. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్ట్ చెప్పడంతో వైసీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సిద్ధమైంది. అయితే నిమ్మగడ్డ చేతిలో ఓడిపోవడం ఇష్టం లేని వైసీపీ నాయకులు ఎలాగైనా నిమ్మగడ్డను దెబ్బ తీయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే నిమ్మగడ్డను దెబ్బతియ్యడానికి ఈసారి వైసీపీ నాయకులు కరోనాను వాడుకొనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
నిమ్మగడ్డ వల్లే కరోనా…
ఏపీలో ప్రజారోగ్యంతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యపరంగా కానీ కరోనా పరంగా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా బాధ్యత వహించాలని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పటికీ కరోనా కేసులు వస్తున్నాయని అయినా మొండిగా ఎన్నికలకు నిమ్మగడ్డ తెర తీశారని ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో జరగబోయే పరిణామాలకు కూడా ఆయనే బాధ్యుడు అవుతాడు అని విజయసాయిరెడ్డి స్పష్టం చెస్తున్నారు. ఇలా కరోనా పేరుతో వైసీపీ నాయకులు నిమ్మగడ్డను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ చిత్తశుద్ధి ఉందా!
వైసీపీ నాయకులు మాటలను మార్చినట్టు ఎవరైనా మార్చగలరా అనిపిస్తుంది. ఎందుకంటే కరోనా మొదట్లోనే, ఎక్కువగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే స్థానిక ఎన్నికులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుంటే ప్రజారోగ్యం దెబ్బతింటుందని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వైసీపీ నాయకులకు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.