జగన్ గ్రాఫ్ పెరిగిందా ? జనాల మద్దతు 45 శాతం

ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే తాజా సర్వే వివరాలు  చూసిన వారికందరికీ ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోయిన ఏడాది సెప్టెంబర్ లో చేసిన సర్వేకు తాజాగా ఫిబ్రవరిలో చేసిన సర్వేతో పోల్చుకుంటే 2 శాతం ఓట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. దాంతో రాబోయే సిఎం జగన్మోహన్ రెడ్డే అనే హుషారు వైసిపి నేతల్లో పెరిగిపోతోంది. దానికి తోడు మొన్నటి వరకూ సర్వేలు చేసిన మీడియా సంస్ధలన్నీ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఓట్లపైనే సర్వేలు జరిపాయి. కానీ తాజా సర్వే మాత్రం కాబోయే సిఎం ఎవరు అనే అంశంపై సర్వే జరిగింది.

ఇండియా టుడే చేసిన సర్వేతో రాష్ట్రంలోని వాస్తవ రాజకీయ పరిస్ధితులకు ఓ సూచనగా చెప్పుకోవచ్చు. మరి జగన్ గ్రాఫ్ రెండు శాతం అంటే 43 నుండి 45కి పెరిగితే చంద్రబాబు గ్రాఫ్ రెండు శాతం తగ్గింది. అంటే 38 శాతం ఓట్ల నుండి చంద్రబాబు గ్రాఫ్ 38 శాతానికి పడిపోయింది. తాజా సర్వే ప్రకారం జగన్, చంద్రబాబుకు వచ్చే ఓట్ల శాతం తేడా 9 శాతంగా తేలింది.

అదే విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేటింగ్ దారుణంగా తయారైంది. పవన్ మాత్రం రాబోయే ఎన్నికల్లో కాబోయే సిఎం తానే అంటూ ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. కానీ సర్వేల్లో పరిస్ధితులేమో మరీ దారుణంగా కనబడుతున్నాయి. జనసేనకు పోయిన సెప్టెంబర్ లో 5 శాతం ప్రజల మద్దతున్నట్లు తేలింది. అలాంటిది ప్రస్తుత ఫిబ్రవరికి ఆ మద్దతు 4 శాతానికి పడిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇతరులకు మద్దతు పెరుగుతుండటం. ఇతరులంటే బిజెపి, కాంగ్రెస్ కావచ్చు. లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధులూ కావచ్చు. లేదా ఎవరికి ఓట్లు వేయాలో తేల్చుకోలేని వారు కూడా కావచ్చు. ఏదైనా ఇతరుల హెడ్ లోని ఓట్ల శాతం పోయిన సెప్టెంబర్ లో 14 శాతం ఉంటే అది ఫిబ్రవరికి 15 శాతానికి పెరిగింది. అంటే ఇతరుల కోటాలో ఓట్ల శాతం పెరగటం రెండు పార్టీలకు నష్టమే సుమా.