ఆ విషయంలో’ వైఎస్ జగన్ కల నెరవేరుతుందా.?

is-ys-jagan-dream-comes-true

is-ys-jagan-dream-comes-true

సరిగ్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. అది కూడా అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి. అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పట్లో చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా వ్యవహరించిందనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ, ఈ కేసులో చంద్రబాబుకి నోటీసులు ఇచ్చిన విషయం విదితమే.

కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి, తనను అకారణంగా వేధించి, వెంటాడి జైలుకు పంపిన చంద్రబాబు మీద వైఎస్ జగన్ కక్ష తీర్చుకుంటున్నారనీ, ఈ క్రమంలోనే చంద్రబాబుని ‘ఏ1’గా అమరావతి భూముల కుంభకోణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తేల్చిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇందులో ‘తనను అకారణంగా జైలుకు పంపారు’ అనే ఆవేదన జగన్‌లో వుందన్నది నిర్వివాదాంశం. అయితే, చంద్రబాబు మీద జగన్‌ది కక్ష సాధింపా.? కాదా.? అన్నది తేల్చడం కష్టమే. గతంలో అసెంబ్లీ సమావేశాలకు ముందే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ జరిగింది. ఆ లెక్కన ఈసారి చంద్రబాబు అరెస్ట్ తప్పకపోవచ్చేమో. చంద్రబాబు అరెస్టయితే మాత్రం, వైఎస్ జగన్ కల నెరవేరినట్లే అవుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. చంద్రబాబుకి ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులు, అందులో పేర్కొన్న చట్టాలని పరిశీలిస్తే, చంద్రబాబు అరెస్ట్ తప్పకపోవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కనీసం ఒక్కరోజైనా చంద్రబాబుని జైల్లో వుంచాల్సిందేనన్నట్లుగా పకడ్బందీ స్క్రీన్ ప్లే రచించబడిందని రాజకీయ చర్చా కార్యక్రమాల్లో వక్తలు అభిప్రాయపడుతుండడం గమనార్హం.

నిజానికి, ఈసారి బడ్జెట్ సమావేశాలు చాలా వాడి వేడిగా జరగాలి. రాష్ట్రం అప్పుల కుప్పగా మరిపోవడం, విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం వైఖరి సహా చాలా అంశాలు అసెంబ్లీని కుదిపెయ్యాలి. కానీ, అలా జరగకూడదంటే ‘డైవర్షన్ రాజకీయం’ తప్పనిసరి. అందుకే, అధికార పార్టీ ఈ ప్లాన్ వేసిందన్నది టీడీపీ వాదన. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. రాష్ట్ర రాజకీయాల్లోనే చంద్రబాబుకి సీఐడీ నోటీసుల వ్యవహారం కనీ వినీ ఎరుగని రీతిలో రాజకీయ దుమారానికి కారణమయ్యింది.

అందుకే, చంద్రబాబు కూడా ‘స్టే’ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అంటే, చంద్రబాబుకీ మేటర్ అర్థమయిపోయిందనుకోవాలేమో.