తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సిపిని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయలేదట. మరెవరో పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని జగన్ తీసుకున్నాడట. నిజమే అయ్యుండొచ్చు కాదనేందుకు లేదు. కానీ ఇక్కడే అందరికీ ఓ విషయం గుర్తుకు వస్తోంది. తెలుగుదేశంపార్టీకి చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడన్న విషయం అందరికీ తెలిసిందే.
టిడిపికి చంద్రబాబు ఎలా అధ్యక్షుడయ్యాడు ? తెలుగుదేశంపార్టీని చంద్రబాబేమైనా స్ధాపించాడా ? ఎన్టీయార్ స్ధాపించిన టిడిపిని ఎన్టీయార్ దగ్గర నుండి గుంజుకుని అధ్యక్షుడయ్యాడు. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్నారు. ముందు సిఎం అయ్యి తర్వాత పార్టీని గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. బహుశా ఆ విషయాన్ని టిడిపి నేతలు మరచిపోయినట్లు నటిస్తున్నా జనాలకు అన్నీ గుర్తే.
ఎన్టీయార్ మరణించేంత వరకూ ఈ విషయాలపై చంద్రబాబును శాపనార్ధాలు పెడుతునే ఉన్నారు. కావాలంటే ఆ విషయాలను యూట్యూబ్ వీడియోల్లో ఎవరైనా చూసుకోవచ్చు. ఇక కళా వ్యాఖ్యల విషయాన్ని చూస్తే, తన పార్టీని జగన్ గుంజుకున్నారని ఇప్పటి వరకూ ఎవరు ఎక్కడా చెప్పినట్లు గుర్తు లేదు. ఒకవేళ కళా చెప్పిందే నిజమైతే ఆ విషయంలో జగన్ పై బురద చల్లే అవకాశాన్ని చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు మీడియా వదిలేస్తుందా ? ఎవరో పెట్టిన పార్టీని జగన్ తీసుకున్నదే నిజమైనా కళా వెంకట్రావుకు వచ్చిన అభ్యంతరాలు ఏంటి ? తెలుగుదేశంపార్టీకి జరిగిన నష్టమేంటో అర్ధం కావటం లేదు.
పోయిన ఎన్నికల్లో వైసిపికి అన్ని సీట్లు వచ్చాయంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మీదున్న అభిమానం, జగన్ కష్టాన్ని చూసే వచ్చాయన్న విషయంలో సందేహం అవసరం లేదు. పార్టీ పేరు వైఎస్సార్సిపీ కాకపోతే మరో పేరైనా రిజల్టు సేమ్. పార్టీ పేరు చూసి జనాలు ఓట్లేయలేదు. వైఎస్సార్, జగన్ లను చూసే ఓట్లేశారు. అంటే తేలుతున్నదేమిటి ?జగనే ముఖ్యం కానీ పార్టీ కాదని. మరి ఇంత చిన్న విషయాన్ని కూడా కళా అర్ధం చేసుకోకుండా నోటికేదొస్తే అది మాట్లాడేయటమే ఆశ్చర్యంగా ఉంది.