ఆళ్ళను టార్గెట్ చేశారా ? వైసిపిలో కలకలం

రాజధాని ప్రాంత వైసిపి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి బెదిరింపులు వస్తున్నాయా ? ఆయన్ను టార్గెట్ చేశారా ? అవుననే అంటున్నారు స్వయంగా శాసనసభ్యుడు. అంతే కాదు తనకు తగిన భద్రత ఇవ్వాలని కూడా డిజిపి ఆర్పీ ఠాకూర్ ను వ్యక్తిగతంగా కలిశారు. అక్కడే డిజిపికి ఓ లేఖ కూడా అందించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేసుకున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టే ఉద్దశ్యంతోనే తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయంగా తాను చాలామంది టార్గెట్ చేసుకున్నట్లు చెప్పారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటం వల్లే తనను బెదిరిస్తు లేఖలు కూడా రాశారని ఆళ్ళ డిజిపికి చెప్పారు. ఎంఎల్ఏగా గెలిచిన దగ్గర నుండి ఆర్కె ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజధాని ప్రాంతంలో రైతుల తరపున ఏకంగా 25 కేసులు దాకా వేశారు.

కారు చౌకగా సదావర్తి భూముల అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించినపుడు కూడా ఆళ్ళ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దాదాపు ఆరునెలల పాటు ఆళ్ళ చేసిన పోరాటం ఫలితంగానే చివరకు భూముల అమ్మకం నుండి ప్రభుత్వం విరమించుకోవాల్సొచ్చింది. చంద్రబాబునాయుడును బాగా ఇబ్బందులు పెడుతున్న ఓటుకునోటు కేసులో కూడా ఆర్కె సుప్రింకోర్టులో పోరాటం చేస్తున్నారు. ఇటువంట అనేక పోరాటాల ద్వారా చంద్రబాబును ఆళ్ళ బాగా ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే తనను ఎవరో టార్గెట్ చేశారంటూ ఆళ్ళ డిజిపిని కలిసి భద్రత పెంచాలని కోరటం గమనార్హం.