యనమలకు ఎదురుగాలేనా ?

తెలుగుదేశంపార్టీ తరపున తుని నియోజకవర్గంలో పోటీ చేస్తున్న  యనమల కృష్ణుడు గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు అందరూ. యనమల కృష్ణుడంటే మంత్రి యనమల రామకృష్ణుడుకి సోదరుడే. పోయిన ఎన్నికల్లో కూడా కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారులేండి. అనుభవజ్ఞుడని చంద్రబాబు మళ్ళీ కృష్ణుడికే టికెట్ ఇచ్చారు.

ప్రభుత్వంపై జనాల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు యనమల సోదరులపై జిల్లాలోనే కాకుండా నియోజవర్గంలో కూడా విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. దాని పర్యవసానమే నియోజకవర్గంలో గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయి. సోదరులపై అవినీతి ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. ఇసుక ర్యాంపుల్లో దోపిడి, నియోజకవర్గం వ్యాప్తంగా సెటిల్ మెంట్లు, నియోజకవర్గంలో మరో నేతను ఎదగనీయకుండా తొక్కిపెట్టటం లాంటి అనేక ఆరోపణలున్నాయి సోదరులపైన.

అదే సమయంలో వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ దాటిశెట్టి రాజాకు వ్యక్తిగత ఇమేజ్ తో పాటు జగన్ ఇమేజి కూడా తోడవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత, యనమల సోదరులపై వ్యతిరేకత కూడా వైసిపికి బోనస్ గా మారుతోంది. ఆర్ధికంగా యనమల సోదరుల ముందు దాటిశెట్టి తక్కువే అయినా విడిగా చూస్తే సిట్టింగ్ ఎంఎల్ఏ కూడా ఆర్ధికంగా బాగా గట్టోడే. ఇక జనసేన తరపున రాజా అశోక్ పోటీలో ఉన్నా గెలిచేంత సీన్ లేదన్నది వాస్తవం.

ఈ నియోజకవర్గం మొత్తం ఓటర్లలో బిసిలదే ప్రధాన పాత్రం. యనమల బిసిలే అయినా పోయిన ఎన్నికల్లో కాపు అభ్యర్ధి దాడిశెట్టి రాజా గెలవటం గమనార్హం. బిసి ఓటర్లు దాదాపు లక్షదాకా ఉంటే కాపులు సుమారు 50 వేలుంటారు. అయినా కాపు వర్గానికి చెందిన దాడిశెట్టే గెలిచారంటే యనమలపై ఏ స్దాయిలో వ్యతిరేకతుందో అర్ధమవుతోంది. అప్పటికన్నా ఇపుడు మరింత వ్యతిరేకత ఇంకా పెరిగింది. పై రెండు సామాజికవర్గాలకు తోడు వైశ్యులు, బ్రాహ్మణులు, ఎస్సీలు, రాజులు కూడా ఉన్నారు. సమీకరణలు చూస్తే యనమల గెలుపు కష్టమనే అనుకోవాలి.