వైసీపీలో వీవీ వినాయక్ చేరుతున్నాడా.? నిజమెంత.?

సినిమా వేరు, రాజకీయం వేరు.! కమెడియన్ అలీని చూశాం.! టీడీపీలో వుండేవాడు.. పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. కానీ, వైసీపీలో చేరాడు. సరే, ఎవరి రాజకీయ నిర్ణయాలు వారిష్టం.. అది వేరే చర్చ.

ఇక, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. వినాయక్ వైసీపీలో చేరబోతున్నాడనీ, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నాడన్నది జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం.

వినాయక్ అంటే, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. జూనియర్ ఎన్టీయార్‌కీ అత్యంత సన్నిహితుడే. సినీ పరిశ్రమలో అందరికీ అత్యంత సన్నిహితుడిగానే వ్యవహరిస్తుంటాడు వినాయక్. చిరంజీవి వెంట ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయాల్లోకి వినాయక్ వస్తాడనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ, వినాయక్ రాజకీయాల్లోకి రాలేదు.

నిజానికి, వినాయక్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనది కాంగ్రెస్ కుటుంబం. వైఎస్సార్సీపీతోనూ ఆయన కుటుంబానికి అనుబంధం వుంది. ఈ నేపథ్యంలోనే వినాయక్‌ని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారట వైసీపీ పెద్దలు.

కానీ, వినాయక్ మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి, వినాయక్ ఎందుకు ఈ ప్రచారాన్ని ఖండించడలేదు.? అంటే, దానికి మాత్రం సమాధానం దొరకడంలేదు.

ఇదిలా వుంటే, మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని వైసీపీలోకి ఆహ్వానించారు, గుంటూరు లోక్ సభ టిక్కెట్టుని ఆశగా చూపించి. పార్టీలో చేరాక, టిక్కెట్టు లేదని తేల్చేయడంతో, అంబటి రాయుడు అలకబూనారు. ప్రస్తుతం జనసేనతో అంబటి రాయుడు టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది.