రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు పార్టీ మారుతున్నారంటే ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారుతున్నారంటే ప్రత్యర్థులు పండగ చేసుకుంటారు. అదీ ఎన్నికల్లో ముంగిట్లో అలాంటి ఉదంతం చోటు చేసుకుంటే..చెలరేగిపోతారు. ఆయన వీడుతున్న పార్టీ పుట్టి మునిగిందంటూ ఎద్దేవా చేస్తారు. ఆ నాయకుడే తమ పార్టీలోకి వస్తానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తారు.
ఆ బలమైన సామాజిక వర్గ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ. ఆయన వీడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. చేరాలనుకుంటున్న పార్టీ టీడీపీ. ఈ నెల 25వ తేదీన ఆయన టీడీపీలో చేరతారనే టాక్ ఉంది. వంగవీటి రాధ టీడీపీలోకి వస్తున్నారంటే కేరింతలు కొట్టాల్సిన కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు కాట్లాడుకుంటున్నారు. ఆయన చేరికను కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
ఎందుకంటే- విజయవాడ ఈస్ట్ లేదా విజయవాడ సెంట్రల్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకరికి టికెట్ గల్లంతవుతుంది. విజయవాడ సెంట్రల్ టికెట్ కోసమే ఆయన పార్టీ మారుతున్నందున.. టీడీపీ సిట్టింగ్ బోండా ఉమామహేశ్వరరావుకు ఎసరు పడుతుందని అంటున్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్న వంగవీటి రాధకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్పందన రాలేదని, సెంట్రల్‌కు బదులుగా విజయవాడ ఈస్ట్ నుంచే పోటీ చేయాలని సూచించారట. దీనికి అంగీకరించకే రాధ పార్టీ ఫిరాయిస్తున్నారని చెబుతున్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం రాధాకు అచ్చొచ్చినదే. రెండుసార్లు ఆయన ఆ స్థానం నుంచే గెలుపొందారు.
1989-94, ఆ తరువాత 2004-2009లో ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. 2014లో వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడాయన టీడీపీలో గనక చేరితే విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తారని, ఆ భరోసాతోనే పార్టీ ఫిరాయిస్తున్నారని సమాచారం. ఆయన చేరికను ఓ వర్గం గట్టిగా వ్యతిరేకిస్తుండగా.. మరో వర్గం స్వాగతిస్తోంది.
రాధా సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు రాధా చేరికను స్వాగతిస్తున్నారు. రాధా సామాజిక వర్గానికే చెందిన పవన్ కల్యాణ్ అండగా ఉండటం వల్లే 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో తమకు ఓట్లు పడ్డాయని బాహటంగా చెబుతున్నారు వారు.
పవన్ కల్యాణ్ వల్ల దూరమైన ఓటుబ్యాంకును వంగవీటి రాధా వల్ల `కొంతవరకైనా` అంటే విజయవాడ సిటీ వరకైనా పరిస్థితి సానుకూలంగా ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో- మరో సామాజిక వర్గ నేతలు ఆయన రాకకు మోకాలడ్డుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు బోండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, బోడేపల్లి ప్రసాద్ సహా దేవినేని అవినాష్ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నుంచి వైఎస్ఆర్ సీపీ ఇలా.. పార్టీలు మారిన రాధాకు పెద్దగా పట్టు లేదని వ్యాఖ్యానిస్తున్నారు. తండ్రి వంగవీటి మోహనరంగా హత్యకు కారణమైన టీడీపీలో ఆయన కుమారుడు రాధా చేరితే పొలిటికిల్ కేరీర్ ముగిసినట్టేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.