వైసీపీలో ట్రబుల్ షూటర్ ఎవరూ లేరా.?

YSRCP

YSRCP : విపక్షాలు అధికార పక్షం మీద దుమ్మెత్తి పోసేటప్పుడు, చాకచక్యంగా ఆ విమర్శల్ని తిప్పి కొట్టడమే కాదు, పార్టీకి సంబంధించి ఎవరైనా రాజకీయంగా ఇరకాటంలో పడ్డొప్పుడు, ఆ సమస్య నుంచి పార్టీ నాయకుడ్నీ, పార్టీనీ గట్టెక్కించే ట్రబుల్ షూటర్ ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. అధికార పార్టీలో ఖచ్చితంగా ట్రబుల్ షూటర్స్ వుండి తీరాలి.

మరి, వైసీపీలో అలాంటి ట్రబుల్ షూటర్ ఎవరు.? సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి.. ఇలా తరచూ కొన్ని పేర్లు వినిపిస్తుంటాయిగానీ, వాళ్ళెవరూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అన్ని వ్యవహారాల్నీ అధినేత వైఎస్ జగన్ దగ్గరుండి చూసుకోవాల్సిందే.

కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీని కారులో మృతదేహం వ్యవహారానికి సంబంధించి పెద్ద రాజకీయ రచ్చ జరుగుతోంది. విపక్షాలు హైడ్రామా నడిపిస్తున్నాయి. బాధిత కుటుంం అధికార పార్టీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలనే డిమాండ్ చేయడమే కాదు, ఏకంగా ఉరి తీసెయ్యాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం.

అసలు విషయం ఇంత వివాదాస్పదమయ్యేదాకా వైసీపీ అధిష్టానం ఎందుకు ఉపేక్షించినట్లు.? ఎమ్మెల్సీ ఇంతవరకు పెదవి విప్పకపోవడమేంటి.? జిల్లాకి చెందిన వైసీపీ ముఖ్య నేతలు ఏమయ్యారు.? పార్టీ అధిష్టానం తరఫున ఈ వ్యవహారంపై స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడమేంటి.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

ఎమ్మెల్సీనే, తన మాజీ డ్రైవర్‌ని పిలిపించుకున్నారనీ, ఆ తర్వాత అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతూ, మృతదేహాన్ని మృతుడి ఇంటికి తీసుకెళ్ళి అప్పగించడమేంటి.? అన్న అంశంపై సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ వుండిపోయిందంటే దానర్థమేంటి.? ట్రబుల్ షూటర్ వుండి వుంటే, ఈ పరిస్థితిని డీల్ చేసి, ఎమ్మెల్సీతో ప్రకటన ఇప్పించడమో, ఇంకోటో చేసి వుండేవారే కదా.!